ఐదు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన పరీక్ష
ధరూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరిగిన గురుకుల ఎంట్రెన్స్ పరీక్షల ప్రశ్నాపత్రం తారుమారు కావడంతో ధరూరు మండలం ర్యాలంపాడు గురుకుల పాఠశాలలో పరీక్షను దాదాపు ఐదు గంటలు ఆలస్యంగా ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా ప్రశ్నా పత్రం ఓపెన్ చేయగా 5వ తరగతి విద్యార్థులకు ఆరో తరగతికి సంబంధించిన ప్రశ్నలు, 6వ తరగతి విద్యార్థులకు 5వ తరగతి ప్రశ్నలు వచ్చినట్లు గుర్తించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఖమ్మం జిల్లాకు వెళ్లాల్సిన ప్రశ్నాపత్రాలు ఇక్కడికి.. ఇక్కడి పత్రాలు అక్కడికి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో విషయాన్ని కలెక్టర్‌కు తెలియజేశారు. అయితే మధ్యాహ్నం ఒంటి గంట అయినా విద్యార్థులు బయటకురాకపోవడంతో పేరెంట్స్ ఎగ్జామ్ సెంటర్ బయట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. చివరికి మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో ప్రశ్నాపత్రాలను తీసుకురాగా పరీక్ష కేంద్రానికి చేరుకునే సరికి 3.30 గంటలైంది. పరీక్ష పత్రాలు కూడా 24 మాత్రమే రాగా విద్యార్థులు 400 మంది ఉండడంతో జిరాక్స్ తీసి 3.40 గంటలకు పరీక్ష ప్రారంభించి 5.40 గంటల వరకు కొనసాగించారు.
నేను రాసిన రూంలో ఒక్కో ప్రశ్న పత్రాన్ని నాలుగు ముక్కలు చింపి ఆ ప్రశ్నాపత్రాలతో పరీక్షలు రాశాం. సైనిక్ స్కైల్ నుంచి కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాశాను. ఏదో గందరగోళంగా పరీక్షలు నిర్వహించారు. మార్కులపై అనుమానాలు కలుగుతున్నాయి.
–విద్యార్థి ముజాహిద్, బుడమర్సు, శాంతినగర్
ఒక్కో ప్రశ్నపత్రాన్ని నాలుగు ముక్కలు చేసి రాయించారు
ఐదు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన పరీక్ష


