డివిజన్ల వారీగా కాంగ్రెస్ ఇన్‌చార్జిల నియామకం
స్టేషన్ మహబూబ్‌నగర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ శుక్రవారం 60 డివిజన్ల వారీగా సీనియర్ నాయకులు, కార్యకర్తలను ఇన్‌చార్జిలుగా నియమించారు. వీరు డివిజన్లలో ఎన్నికల ప్రచార కార్యకలాపాలను సమన్వయం చేయాలని, బూత్‌స్థాయిలో పార్టీ బలోపేతం, కార్పొరేటర్ అభ్యర్థులు, పార్టీ కేడర్ మధ్య సమన్వయం చేయాలని సూచించారు. ఎన్నికల సన్నద్ధతపై క్రమం తప్పకుండా డీసీసీకి నివేదించాలని ఆదేశించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించేలా అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
ప్రైవేట్‌లో అధిక ప్రసవాలపై డీఎంహెచ్‌ఓ ఆగ్రహం
జడ్చర్ల టౌన్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాలు అధికం కావటం పట్ల జిల్లా వైద్యాధికారి డా.కృష్ణ వైద్యసిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గంగాపురం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో గంగాపురం, జడ్చర్ల అర్బన్ హెల్త్‌సెంటర్, మిడ్జిల్ ప్రాథమిక వైద్య ఆరోగ్యకేంద్రంలపై ఆయన సమీక్ష నిర్వహించారు. జడ్చర్ల అర్బన్‌హెల్త్ సెంటర్ పరిధిలో అత్యధికంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవం కావడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలోని నాలుగు సబ్‌సెంటర్లలో సిబ్బంది అదనంగా ఉన్నారని, వారందరినీ మహబూబ్‌నగర్ ఎంసీహెచ్‌కు పంపించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. గంగాపురం, మిడ్జిల్ కేంద్రాల్లో ప్రసవాలు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్‌సీల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలని ఆదేశించారు. మూడు కేంద్రాల్లోనూ అబార్షన్‌ల సంఖ్య అధికంగా ఉందని, అందుకు గల కారణాలు వివరిస్తూ నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం కల్పించాలన్నారు. సమావేశంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ డా.శివకాంత్, అర్బన్ హెల్త్ సెంటర్ డా.మనుప్రియ, గంగాపురం వైద్యాధికారి డా.ప్రతాప్‌చౌహాన్ పాల్గొన్నారు.


