కాంగ్రెస్ పాపాలను ప్రజల్లో ఎండగట్టాలి
● మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పాపాలను మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం టీడీగుట్ట, చిన్నదర్పల్లి, కిద్వాయిపేట్, మొనప్పగుట్ట, టీచర్స్ కాలనీ డివిజన్లలో మాజీ హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు నీళ్లకు అరిగోస పడే రోజుల నుంచి ప్రతి రోజు నీళ్లు వచ్చే పరిస్థితిని మిషన్ భగీరథతో సమస్యలు పరిష్కారం చూపినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చి రెండేళ్లలోనే తీవ్రమైన వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం మూట కట్టుకుందన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అత్యధికంగా బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచి కార్పొరేషన్‌ను దక్కించుకుంటామన్నారు. ఈ సందర్భంగా తిమ్మసానిపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సిములు తదితరులు పాల్గొన్నారు.


