ఎన్నికల్లో పీఓ, ఏపీఓల పాత్ర కీలకం
పాలమూరు: మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా స్వేచ్ఛాయుతంగా నిబంధనలు ఉల్లఘించకుండా జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని మైక్రో అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. నగరంలోని ఎస్‌వీఎస్ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం మైక్రో అబ్జర్వర్లకు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 11న మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తో పాటు దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్‌లను నియమిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంచనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పూర్తి చేశామని, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా సజావుగా పూర్తి చేయాలన్నారు. రాజకీయ పార్టీల ఆధారంగా జరిగే ఎన్నికలు కావడంతో పోటీ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ ప్రక్రియలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పూర్తి చేయాలన్నారు. పోలింగ్ సమయంలో జరిగే ప్రతి ఘటనను నివేదికలో నమోదు చేసి పరిశీలకులకు రిపోర్ట్ చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 36 మంది మైక్రో పరిశీలకులను నియమిస్తున్నట్లు తెలిపారు.
● మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని పీఓ, ఏపీఓలను కలెక్టర్ ఆదేశించారు. పీఓ, ఏపీఓలకు ఎన్నికలపై రెండో విడత ప్రత్యేక శిక్షణలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణపై మంచి అనుభవం ఉందని, పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పీలోలకు ఇచ్చిన హ్యాండ్‌బుక్‌ను భగవద్గీతలా భావించి ప్రతి అంశాన్ని శ్రద్ధగా చదివి మరింత అవగాహన పెంచుకోవాలన్నారు. ఎన్నికల ముందు రోజు పీఓలు, ఏపీఓలు, పోలింగ్ సిబ్బంది తమ తమ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు ఉదయం 9 గంటల వరకు చేరుకోవాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, భూత్పూర్ మున్సిపాలిటీకి భూత్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దేవరకద్రకు పంపిణీ కేంద్రాన్ని మార్కెట్ యార్డులో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సామగ్రి స్వీకరణ సమయంలో చెక్‌లిస్ట్ ప్రకారం అన్ని వస్తువులు ఉన్నాయా లేదా సరి చూసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ముందు రోజే అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చూసుకోవాలని, కేంద్రం చుట్టూ 100మీటర్ల వరకు మార్కింగ్ చేసి ఆ పరిసరాల్లో ఎలాంటి ఎన్నికల ప్రచారం లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి ఓటరు బ్యాలెట్ పేపరును తప్పనిసరిగా బ్యాలెట్ బాక్స్‌లో వేస్తున్నాడా లేదా అనేది పర్యవేక్షించాలన్నారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ పేపర్ అకౌంట్, పీఓ డైరీలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలన్నారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్‌డీఓ నవీన్, డీఈఓ ప్రవీణ్‌కుమార్, సీఎంఓ సుధాకర్, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, మాస్టర్ శిక్షకులు బాలు యాదవ్ బైకాని, శ్రీకాంత్, నాగరాజు పాల్గొన్నారు.
● ఎన్నికలను న్యాయంగా నిర్వహించే బాధ్యత సూక్ష్మ పరిశీలకులపై ఉందని జిల్లా జనరల్ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనీదేవి, కలెక్టర్ విజయేందిర పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ఫెసిలిటేషన్ సెంటర్ సౌలభ్యం కల్పించినట్లు తెలిపారు. ఈ నెల 7, 8, 9తేదీలలో ఫెసిలిటేషన్ సెంటర్‌లలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని తెలిపారు. ఉద్యోగులు తమ ఎన్నికల విధుల ఉత్తర్వుల ఎపిక్‌కార్డు కాపీని నింపిన ఫారం 12తోపాటు జతచేసి అక్కడే సమర్పించాలన్నారు.
పోలింగ్ కేంద్రాలకు ఒక్కరోజు ముందే చేరుకొని ఏర్పాట్లు చేసుకోవాలి
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు 36 మంది మైక్రో అబ్జర్వర్ల నియామకం
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర


