రెండురోజుల్లో రూ.20 లక్షల రాబడి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ/వనపర్తిటౌన్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పుణ్యాన ఆస్తిపన్ను, నల్లాబిల్లులు, మున్సిపల్ కాంప్లెక్స్‌ల అద్దెబకాయిలు వసూలవుతున్నాయి. ఈనెల 27వ తేదీ సాయంత్రం ఎన్నికల నగారా మోగిన విషయం విదితమే. దీంతో ఈసారి మొత్తం 60 డివిజన్లకు పెరగడంతో అభ్యర్థులు సైతం అధిక సంఖ్యలో ఈ ఎన్నికల్లో నిలుచోవాలని భావిస్తున్నారు. అయితే వారు తమ ఇంటి పన్ను, నల్లా బిల్లులు ఏమైనా పెండింగ్‌లో ఉంటే ‘నో డ్యూ సర్టిఫికెట్’ ఇవ్వరు. దీనివల్ల పాత బకాయీలన్నీ చెల్లించేందుకు ప్రస్తుతం వారు ముందుకు వస్తున్నారు. అలాగే వారికి ష్యూరిటీ ఇచ్చేవారికి సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు చెబుతుండటంతో అందరూ కార్యాలయ ఆవరణలోని కళాభారతి సెల్లార్‌కు వచ్చి ఠంచన్‌గా అన్ని బకాయిలు చెల్లిస్తున్నారు. కేవలం ఈ రెండు రోజుల్లోనే కార్పొరేషన్‌కు వీటి ద్వారా సుమారు రూ.20 లక్షలు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది.
ఇక ఈనెల 27 నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మున్సిపల్ సిబ్బంది నగరంలోని ఆయా డివిజన్ల పరిధిలో ఈపాటికే రాజకీయ పార్టీల జెండాలు, నాయకులు ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను, ప్రచారం కోసం ఎక్కడికక్కడ అధికార పార్టీ తరఫున గోడలకు అంటించిన వాల్‌పోస్టర్లను తొలగిస్తున్నారు. ముఖ్యకూడళ్లలో ఎలాంటి ఫ్లెక్సీలు, ఇతర పోస్టర్లు లేకుండా చూస్తున్నారు.
వనపర్తి మున్సిపాలిటీలో కూడా నో డ్యూ సర్టిఫికెట్ కోసం పోటీదారులు ఎగబడ్డారు. పురపాలికకు ఒక్కరోజులో రూ.10.70 లక్షల ఆదాయం వచ్చింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట అధికారులు ప్రతేక్యంగా నాలుగు కౌంటర్‌లను ఏర్పాటు చేసి నో డ్యూ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. ఆస్తి పన్ను చెల్లించడం ద్వారా రూ.3.85లక్షలు, కుళాయి పన్నుల ద్వారా రూ.6.85 లక్షలు వచ్చింది.


