2.39 కిలోల గంజాయి పట్టివేత
కల్వకుర్తి టౌన్: బతుకుదెరువు కొరకు ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చి మత్తుకు అలవాటై ఈజీ మనీ కోసం స్థానికంగా గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు యువకులు పట్టుబడిన ఘటన ఊర్కొండలో బుధవారం చోటు చేసుకుంది. కల్వకుర్తి సీఐ నాగార్జున తెలిపిన సమాచారం మేరకు ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లా భూంపూర్‌కు చెందిన లిట్టు మాలిక్, గర్మాటికి చెందిన అభిమన్యూ మాలిక్ ఇద్దరు స్థానిక సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో మిషన్ ఆపరేటర్లుగా పని చేస్తున్నారు. వీరికి గంజాయి తాగే అలవాటు ఉండటంతో పాటు అక్కడి నుంచి తీసుకొచ్చి స్థానికంగా విక్రయించేవారు. ఈ క్రమంలో అభిమన్యూ మాలిక్ ఈ నెల 15న సొంత గ్రామానికి వెళ్లి 23వ తేదీన అదే రాష్ట్రంలోని కంపాడాలోని తెడీ బజార్ నుంచి చాచా అనే వ్యక్తి వద్ద 2.5 కేజీల గంజాయిని తీసుకొని మిల్లు వద్దకు తెచ్చాడు. అనంతరం మిల్లు ఎదుట ఉన్న చెట్ల పొదల్లో గంజాయి బ్యాగును దాచి, విక్రయాలు చేసేవారు. నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు వారిని అరెస్టు చేసి 2.39 కేజీల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని కల్వకుర్తి కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. గంజాయి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్‌ఐ కృష్ణదేవ, కానిస్టేబుళ్లు హర్ష, తిరుపతయ్య, వెంకన్నను ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌పాటిల్, డీఎస్పీ వెంకట్‌రెడ్డి అభినందించారు.
ఆటో బోల్తా..
15 మందికి గాయాలు
జడ్చర్ల: ఆటో బోల్తా పడిన ప్రమాదంలో 15 మంది గాయాలపాలైన ఘటన మండల పరిధిలో బుధవారం జరిగింది. పోలేపల్లి సెజ్‌లోని పైపుల పరిశ్రమలో పనిచేసేందుకు కూలీలు ఆటోలో వెళ్తుండగా సెజ్ నుంచి సిబ్బందిని జడ్చర్లకు తీసుకొస్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న దాదాపు 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.
● కార్మికులుగా వచ్చారు.. విక్రేతలుగా మారారు
● ఒడిశాకు చెందిన ఇద్దరు యువకుల అరెస్టు
● సూర్యలత స్పిన్నింగ్ మిల్లు కార్మికులుగా గుర్తింపు


