కారు, డీసీఎం ఢీ: యువకుడి మృతి
వెల్దండ: మండల పరిధిలోని నారాయణపూర్‌గేట్ వద్ద బుధవారం కారు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న వల్లపుదాసు వెంకటేష్‌గౌడు (28) అనే యువకుడు మృతి చెందాడు. కుటుంబసభ్యుల వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం సరికొండకు చెందిన వెంకట్‌గౌడు మహేశ్వరంలోని ఐసీడీఎస్ సీడీపీఓ కార్యాలయంలో డేటాఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం కల్వకుర్తిలోని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో నారాయణపూర్ గేట్ వద్దకు రాగానే కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం ఢీ కొట్టింది. ప్రమాదంలో వెంకట్‌గౌడుకు తీవ్రగాయాలు కాగా కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు.
ఎమ్మెల్యే పరామర్శ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకట్‌గౌడు కుటుంబాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శించారు. మృతికి గల కారణాలను తెలుసుకొని కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అదే విధంగా మహేశ్వరం కార్యాలయ ఐసీడీఎస్ సీడీపీఓ శాంతిశ్రీ,తో పాటు తోటి ఉద్యోగులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
వనపర్తి రూరల్: మేడిపల్లి దగ్గర జరిగిన కారు ప్రమాదంలో పట్టణంలోని ఆర్టీసి కాలనీకి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయాలు కాగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పట్టణానికి చెందిన నిఖిల్, సాయికిరణ్, వెంకట్, రాకేష్, అభినవ్, యశ్వంత్ సాత్విక్, హర్షవర్దన్ చిన్ననాటి స్నేహితులు. వీరంతా హైదారాబాద్‌లోని వేరు వేరు కళాశాలల్లో చదువు కుంటున్నారు. మంగళవారం హైదారాబాద్‌లోని పోచారం సద్భావన టౌన్ షిప్ నుంచి కారులో మౌలాలిలోని స్నేహితుని అన్న ఇంటికి బయలుదేరారు. అర్ధరాత్రి హాస్టల్‌కు తిరిగి వస్తుండగా కారు బోడు ఉప్పల్ సమీపంలోని మేడిపల్లి దగ్గర ముందు వెళ్తున్న బైక్‌ను తప్పించ బోయి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో నిఖిల్ (22) సాయికిరణ్ (23) అక్కడిక్కడే మృతి చెందగా వెంకట్, రాకేష్‌కు తీవ్ర గాయాలు కాగా అభినవ్, యశ్వంత్‌రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. స్వాతిక్, హర్షవర్దన్ ఎలాంటి గాయాలు లేకుండా బయట పడ్డారు. వయసుకు వచ్చిన కుమారులు చనిపోవడంతో నిఖిల్, సాయికిరణ్ కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.


