పరిహారం కోసం రోడ్డెక్కిన రైతులు
● ఆర్బిట్రేషన్ తర్వాత అందని నోటీసులు, నష్టపరిహారం
● రెండో విడత పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు
● గంగిమాన్‌దొడ్డి వద్ద రోడ్డు పనులు అడ్డుకొని నిరసన
గట్టు: భారత్‌మాల ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణం కోసం భూములు కోల్పోయిన వారికి ఆర్బిట్రేషన్ తర్వాత రెండో విడతగా చెల్లించే నష్టపరిహారం అందకపోవడంతో బుధవారం రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గంగిమాన్‌దొడ్డి వద్ద గట్టు, గంగిమాన్‌దొడ్డి గ్రామాలకు చెందిన రైతులు నష్టపరిహారం చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, రోడ్డు పనులను అడ్డుకుని రోడ్డుపై బైటాయించారు. ఏడాది కాలంగా తాము నష్ట పరిహారం కోసం కలెక్టరేట్‌తో పాటుగా గట్టులోని తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. తమ పొలాల్లో రోడ్డు నిర్మాణం పూర్తయిందని, రెండవ విడత పరిహారం మిగతా రైతులకు అందజేసి, మాకేందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. నెల రోజుల క్రితం గద్వాల కలెక్టరేట్ అధికారులు నోటీసులు ఇచ్చి, మా నుంచి పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నారని, అయినా నష్టపరిహారం మాత్రం చెల్లించలేదన్నారు.


