
ప్రజలు సురక్షితంగా ఉండాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రానున్న 72 గంటలు మోతాదుకు మించి భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆిస్తి, ప్రాణ, పశు నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రతిశాఖ అధికారులు వారి పరిధిలో విధులను, బాధ్యతలను సజావుగా నిర్వహించాలన్నారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, వైద్య, ఆరోగ్యం, పంచాయతీరాజ్, విద్యుత్, వ్యవసాయ, మిషన్ భగీరథ శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వానలకు నీళ్లు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖ అధికారులు తమ పరిధిలో ఉన్న సిబ్బందితో వెంటనే సమావేశం పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైన వెంటనే స్పందించేందుకు కలెక్టర్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరదలు, ఇళ్లకు నష్టం, రోడ్లు ధ్వంసం, చెట్లు కూలిపోవడం వంటి విపత్కర పరిస్థితులు ఎదురైన సందర్భంగా వెంటనే కలెక్టరేట్‌లోని కంట్రోల్‌రూమ్ నంబర్ 08542–241165కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ జానకి, అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, నర్సింహారెడ్డి, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, సీపీఓ రవీందర్, డీఎంహెచ్‌ఓ కృష్ణ, మిషన్ భగీరథ ఈఈ పుల్లారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.