మహబూబ్‌నగర్ క్రీడలు: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఈనెల 22 నుంచి 27 వరకు జరగనున్న జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రతిభ చాటాలని జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి రాంచందర్ అన్నారు. జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు వెళుతున్న 18 మంది క్రీడాకారులను బుధవారం మహబూబ్‌నగర్ మెయిన్ స్టేడియంలో ఆయన అభినందించారు. జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోచ్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.