భారీ భద్రత మధ్య సీఎం పర్యటన
● బందోబస్తును పర్యవేక్షించిన అదనపు డీజీపీ డీఎస్ చౌహాన్
మహబూబ్‌నగర్ క్రైం: పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం శనివారం జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో భాగంగా పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది. చిట్టిబోయిన్‌పల్లి, ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సభల దగ్గర కట్టుదిట్టమైన బందోబస్తు కల్పించారు. అదనపు డీజీపీ డీఎస్ చౌహాన్ ముందుగా అక్కడికి చేరుకుని సిబ్బందికి సూచనలు ఇవ్వడంతో పాటు పరిశీలించారు. జోగుళాంబ గద్వాల జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, ఎస్పీలు జానకి, సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ బందోబస్తును పర్యవేక్షించారు. మొదట హెలీప్యాడ్ ద్వారా చిట్టిబోయిన్ పల్లి దగ్గర దిగిన సీఎం ఐఐఐటీ భవనం భూమి పూజ తర్వాత రోడ్డుమార్గంలో భూత్పూర్ మీదుగా ఎంవీఎస్ డిగ్రీ కళాశాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారితో పాటు భూత్పూర్ నుంచి మహబూబ్‌నగర్ రోడ్డు మార్గంలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసి హెలీప్యాడ్ దగ్గర అదనపు సిబ్బంది విధులు నిర్వహించారు.


