బోనస్ ‘సంబురం’
● సన్న ధాన్యం రైతులకు రూ. 33.99 కోట్లు జమ
● జిల్లాలో 1.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): సన్నరకం ధాన్యం విక్రయించిన రైతులకు సంక్రాంతి రూపంలో బోనస్ వచ్చింది. జిల్లాలో 86,776 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం అమ్మిన రైతులకు రూ.43.39 కోట్లు జమ కావాల్సి ఉండగా, ఇప్పటివరకు పౌర సరఫరాల శాఖ జమ చేసిన డబ్బులతో ఇప్పటివరకు 12,986 మంది రైతుల ఖాతాల్లో రూ.33.99 కోట్లు జమ అయ్యాయి. మరో 3,628 మంది రైతులకు రూ.9.40 కోట్లు బోనస్ రూపంలో రావాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సన్న రకం ధాన్యం విక్రయించిన రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ నిధులను విడుదల చేసింది. త్వరలోనే మరోసారి పౌర సరఫరాల శాఖ బోనస్ ఇచ్చే అవకాశం ఉండటంతో అందరికీ బోనస్ డబ్బులు అందుతాయని జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ రవినాయక్ తెలిపారు.
● జిల్లాలోని 195 కేంద్రాల్లో 1.42 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీటిలో 86,776 మెట్రిక్ టన్నులు సన్న ధాన్యం, 55,224 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం ఉన్నాయి. ఇప్పటి వరకు 28,078 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.337 కోట్లు జమ చేశారు. మరో రూ.3 కోట్లు చెల్లించాల్సి ఉంది. రోజుల వ్యవధిలోనే ఇవి కూడా జమ అవుతాయని జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ రవినాయక్ వెల్లడించారు. వాస్తవానికి రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినా, మోంథా తుఫాన్ ప్రభావంతో దిగుబడి తగ్గి కొనుగోలు కేంద్రాలకు తక్కువగా వచ్చిందని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు.


