నేటి నుంచి ఊర్కొండపేట బ్రహ్మోత్సవాలు
● ఆపద మొక్కుల వాడిగా కొలువైన
అభయాంజనేయుడు
● ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
ఊర్కొండ: ఆపదలో ఉన్న వారికి ఆపద్భాంధవుడిగా.. పిలిస్తే పలికే దైవంగా పేరొందిన ఊర్కొండపేట అభయాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆలయానికి తూర్పున ఉన్న గుండంలో స్నానమాచరిస్తే కష్టాలు తొలగుతాయ ని భక్తుల నమ్మకం ఉండడంతో స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లా తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు.
సింధూర తిలకం లేని స్వామివారు..
ఊర్కొండపేట ఆలయంలో కొలువైన స్వామివారికి సింధూర తిలకం ఉండదు. తైలంలో ఉన్న ఆంజనేయుడి భారీ విగ్రహమే భక్తులకు దర్శనమిస్తుంది. అందుకు తగ్గట్లుగానే గర్భాలయం సైతం ఎత్తుగా ఉంటుంది.స్వామివారికి తైలాభిషేకం, నువ్వు ల నూనె ఇష్టమని భక్తులు విశ్వసిస్తుండడంతో పోటీ పడి వాటిని సమర్పిస్తుంటారు. అదే విధంగా ప్రతి మంగళవారం, శనివారాల్లో వ్రతాలు అర్చనలు, హారతులు, అభిషేకాలు, పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. ప్రతి శనివారం రాత్రి స్వామి వారికి పల్లకీ సేవతో పాటు 108 తమలపాకులు, జిల్లెడు పూలను సమర్పిస్తారు. 90 ఏళ్ల నాటి ఇనుప రథంలో స్వామివారిని ఊరేగిస్తారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాతర పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ప్రత్యేక కార్యక్రమాలు
● 17న ఉదయం 8 గంటలకు అర్చకులు చిరువెళ్లి కృష్ణమూర్తి ఇంటి నుంచి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఆలయ ప్రవేశం చేయడంతో జాతర ప్రారంభం అవుతుంది. అనంతరం ధ్వజారోహనం, స్వా మివారి మూల విరాట్‌కు పంచామృత అభిషేకం, నూతన వస్త్రాలు, వెండి ఆభరణాల అలంకరణతో సహాస్త్ర నామార్చన నిర్వహిస్తారు.
● 18న ఆదివారం ప్రత్యేక పూజలు, సహాస్త్ర నామార్చన, స్వామివారికి గజ వాహాన సే వ, భజనలు, ప్రదోష పూజలు చేస్తారు.
● 19న సోమవారం ఉదయం పూజలు, రథోత్సవం, పంచసూక్తులతో పూజలు కొనసాగిస్తారు.
● 20న మంగళవారం స్వామివారికి మాన్యసూక్తులతో అష్టోత్తర నామావళి, మంగళహారితి, రాత్రికి పల్లకీసేవ
● 21న బుధవారం ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకం, అష్టోత్తర పూజలు, రాత్రి ఒంటె వాహాన సేవ
● 22న గురువారం స్వామివారికి అభిషేకం, అర్చన లు, రాత్రికి నెమలి వాహాన సేవ, గ్రామ భజన మండలితో భజనలు
● 23న శుక్రవారం స్వామివారికి పూజలు, 11 గంటలకు చక్రతీర్థం, అభిషేకం, మంత్ర పుష్పం, సాయంత్రం 6 గంటలకు భజనలు, మంగళహారతులతో ఉత్సవ విగ్రహాలను ఆలయ పూజారి గృహానికి చేరుస్తారు.
నేటి నుంచి ఊర్కొండపేట బ్రహ్మోత్సవాలు


