విద్యుత్‌ పొదుపు.. నీటి సంరక్షణ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ పొదుపు.. నీటి సంరక్షణ

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

మహబూబాబాద్‌ రూరల్‌: ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో విద్యుత్‌ పొదుపు, నీటి సంరక్షణ ప్రజా ఉద్యమంలా మారాలి. ఈమేర కు ఈనెల 1నుంచి 7వ తేదీ వరకు మిషన్‌ లైఫ్‌ పేరిట కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టాలని టీజీ రెడ్కో అధికారులు సూచించారు. ముఖ్యంగా విద్యుత్‌ పొదుపు, నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పర్యావరణహిత జీవనశైలిని అలవర్చుకోవాలని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత..

పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. ప్రతీ పౌరుడి సామాజిక బాధ్యత, మన దైనందిన జీవితంలో పాటించే చిన్న చిన్న పొదుపు అలవాట్లు సైతం పర్యావరణ పరిరక్షణలో గొప్ప మార్పులకు నాంది పలుకుతాయి. కాగా, ప్రజలు తమ రోజువారీ జీవితంలో కొన్ని ముఖ్యమైన అంశాలను తప్పనిసరిగా పాటించాలి.

విద్యుత్‌ పొదుపు..

అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు, ఇతర విద్యుత్‌ పరికరాలను ఆపివేయడం ద్వారా విద్యుత్‌ వృథాను అరికట్టవచ్చు.

సౌరశక్తి వినియోగం..

సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించి, సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రజలు విస్తృతంగా ప్రోత్సహించాలి.

నీటి సంరక్షణ..

నీటిని వృథా చేయకుండా, ప్రతీ నీటి బొట్టును విలువైన వనరుగా భావించి పొదుపుగా వినియోగించాలి.

పర్యావరణహిత జీవనశైలి..

ప్రకృతి వనరులను పరిరక్షిస్తూ, పర్యావరణానికి హాని కలిగించని జీవన విధానాలను అలవర్చుకోవాలి.

ప్రతీ యూనిట్‌ దేశ సంపదకు తోడ్పాటు..

మనం ఆదా చేసే ప్రతీ యూనిట్‌ విద్యుత్‌ దేశ సంపదకు తోడ్పడుతుంది. మనం పొదుపు చేసే ప్రతీ నీటి బొట్టు భావితరాలకు భరోసానిస్తుంది. నేడు మనం చేసే చిన్నచిన్న ప్రయత్నాలే రేపటి తరాలకు ఆరోగ్యకరమైన, పచ్చని భవిష్యత్‌ను అందిస్తాయి. ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలందరూ మిషన్‌ లైఫ్‌ కార్యక్రమంలో భాగస్వాములై విద్యుత్‌ పొదుపు, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ అంశాలను ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలి.

– గంధం రాజేందర్‌, డీఈ, టీజీ రెడ్కో, వరంగల్‌

ప్రజల్లో అవగాహన..

కుటుంబ సభ్యులు, విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలకు విద్యుత్‌ పొదుపు, నీటి సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలి. మిషన్‌ లైఫ్‌ కార్యక్రమం కేవలం నవంబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే వారోత్సవానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రతీ ఒక్కరి నిత్యజీవితంలో ఒక భాగంగా మారాలి. ప్రతీ ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టాలి. వ్యక్తిగత బాధ్యతతో సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలి.

ప్రజా ఉద్యమంలా మారాలి

మిషన్‌ లైఫ్‌ కార్యక్రమంతో పర్యావరణ పరిరక్షణ

ఈ నెల 7వరకు కార్యక్రమాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement