● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్ రూరల్ : విజయానికి ఏకై క మార్గం చదువు అని, పోలీస్ శాఖలో భాగస్వాములై సమాజ సేవచేసే అవకాశం రావడం గర్వకారణంగా భావించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు ఉచిత శిక్షణ శిబిరాన్ని కలెక్టర్ స్నేహశబరీష్, ఎస్పీ శబరీష్ సోమవారం సందర్శించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసి, పరీక్షల సన్నద్ధతపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థులు తమ లక్ష్యంపై పూర్తి ఏకాగ్రతతో దృష్టి సారించి, క్రమశిక్షణతో కూడిన ప్రణాళికాబద్ధమైన చదువును కొనసాగించాలని సూచించారు. అందుబాటులో ఉన్న సమయాన్ని వృథా చేయకుండా పరీక్షల సన్నద్ధతకు పూర్తిగా వినియోగించుకోవాలని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ, సమాజానికి సేవ చేయడంలో పోలీస్ శాఖ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. అటువంటి బాధ్యతాయుతమైన పోలీస్ శాఖలో భాగస్వాములు కావడం ఎంతో గర్వకారణమన్నారు. అభ్యర్థులు పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించి, ప్రజలకు సేవచేసే గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, ఆర్‌ఐ భాస్కర్, టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, శిక్షకులు భాగ్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు.


