నూతనకల్: దసరా పండుగ వేళ స్నేహితులతో సరదాగా గడపాలని వచ్చిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని గుండ్లసింగారం శివారు కత్వ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా దేవరుప్పల మండలం ఇసునూరు గ్రామానికి చెందిన భానుప్రకాష్ (23) హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో నివసిస్తూ ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేసే ఆత్మకూర్ (ఎస్) మండలం ముక్కుడుదేవులపల్లికి చెందిన ఇరుగు వినయ్, హైదరాబాద్కు చెందిన సుభానీతో అతనికి స్నేహం ఏర్పడింది. దసరా పండుగ సెలవుల నేపథ్యంలో వినయ్ ఆహ్వానం మేరకు భానుప్రకాష్, సుభానీ ముక్కుడుదేవులపల్లికి వచ్చారు. ఆదివారం వీరంతా కలిసి సరదాగా నూతనకల్ మండలం గుండ్లసింగారం కత్వ వద్దకు చేరుకుని చిన్నపాటి విందు ఏర్పాటు చేసుకున్నారు. భోజనాల అనంతరం ముగ్గురూ ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు. భానుప్రకాష్కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు టవల్ అందించి కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై నాగరాజు తన సిబ్బందితో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. భానుప్రకాష్ మృతదేహాన్ని వెలికితీసేందుకు ఎస్సై నాగరాజు నీటిలోకి దిగి, సుమారు రెండు గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నూతనకల్ మండలం
గుండ్లసింగారంలో విషాదం


