రఘునాథపల్లి: దసరా సెలవుల్లో ఆనందంగా గడపడానికి అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు కెనాల్లో పడి మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం భాంజీపేటలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జనగామకు చెందిన మహమ్మద్ ఆయూబ్, అఫ్రిన్ దంపతుల కుమారుడు తాహేర్(07) దసరా సెలవుల నిమిత్తం కుటుంబీకులతో కలిసి భాంజీపేటలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం తన తాత ఎం.డి గపూర్తో కలిసి బైక్పై గ్రామ శివారులో స్టేషన్ఘన్పూర్ నుంచి నవాబుపేట వెళ్లే కెనాల్ను చూసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో కెనాల్ వద్ద వాహనం ఆపి దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటి ఉధృతి ఉన్న కెనాల్లో పడ్డాడు. దీంతో కళ్లెదుటే మనువడు నీటిలో కొట్టుకుపోతుండడాన్ని చూసిన గపూర్ వెంటనే కెనాల్లోకి దూకి తాహేర్ను కాపాడే ప్రయత్నం చేశాడు. అయినా ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో బాలుడిని రక్షించడం సాధ్య పడలేదు. పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే ఫైర్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి రెండు గంటల పాటు గాలించి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఏడేళ్ల బాలుడు విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించారు. ఈ ఘటనపై తండ్రి ఆయూబ్, కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం. భరత్ తెలిపారు.
కెనాల్లో పడి బాలుడి మృతి
బాంజీపేటలో పండుగ వేళ విషాదం


