దేవరుప్పుల : స్వయం ఉపాధి పనులు చేసుకుంటూ జీవించే ఓ యువకుడు బతుకమ్మ, దసరా ఉత్సవాల కోసం స్థానిక పంచాయతీ పిలుపు మేరకు వెలుగులు ఇచ్చేందుకు లైట్లకు మరమ్మతులు చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఈ ఘటన శనివారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురంలో చోటు చేసుకుంది. ఎస్సై చింత రాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిత్తలూరి లక్ష్మి, అంజయ్య దంపతుల రెండో మధు( 30)ను స్థానిక పంచాయతీ ప్రజాప్రతినిధి.. చౌరస్తాలోని హైమాస్ట్ లైట్లు వెలగడానికి మరమ్మతులు చేయాలని కోరారు. దీంతో ఎలక్ట్రికల్ వృత్తిపై అనుభవం ఉన్న మధు స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో పైనుంచి పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం అంబులెన్స్లో జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. కాగా, పండుగ ఏర్పాట్ల సందర్భంగా మధు మృతి చెందడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ధర్మాపురంలో ఘటన


