మరిపెడ రూరల్: ఓవైపు ఎండ తీవ్రత.. మరోవైపు బావి నీరు వరిచేనుకే చాలని పరిస్థితి. వర్షాన్ని నమ్ముకుని సాగు చేసిన మిరప చేనును కాపాడుకోవడానికి ఓ రైతు బిందెతో మొక్కమొక్కకూ నీరు పోస్తూ పడరాని పాట్లు పడుతున్నాడు. మరిపెడ మండలం వీరారం గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకట్నాయక్తండాకు చెందిన గిరిజన రైతు ధర్మసోత్ రాజు తనకున్న ఎకరం భూమిలో అరెకరం వరి, మరో అరెకరం మిర్చి సాగు చేశాడు. మొక్కలు ఏపుగా పెరిగాయి. కొద్ది రోజులుగా పెరుగుతున్న ఎండ తీవ్రతతో బావిలో నీరు తగ్గిపోతోంది. వరి పొలానికి నీరు పారించడమే కష్టంగా మారింది. మిర్చి మొక్కలను కాపాడుకునేందుకు ఆ రైతు ఓ చేతిలో బిందె మరో చేతిలో లోట పట్టుకొని మొక్కమొక్క తిరుగుతూ నీరు పోస్తున్నాడు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. మరో ఐదు నెలల పాటు మిర్చి పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు.


