● ఉద్యోగుల సెటిల్మెంట్ ఫైళ్ల క్లియరెన్స్లో జాప్యం
● కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పెన్షనర్లు, ఉద్యోగులు
‘జిల్లాలోని ఓ మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇటీవల పదవీ విరమణ పొందారు. ఆయనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బుల కోసం సంబంధిత శాఖ జిల్లా అధికారి ఖజానా శాఖకు ఫైల్ పంపించారు. అక్కడ ఫైల్ పరిశీలించి రాష్ట్ర కార్యాలయానికి పంపించాలి. కానీ, ఖజానాశాఖ జిల్లా కార్యాలయంలో పనిచేసే అధికారులు ఈ ఫైల్స్ పంపించేందుకు జాప్యం
చేస్తున్నారు. అయితే సంబంధిత ఖజానా శాఖ అధికారులను సదరు రిటైర్డ్ ఉద్యోగి కలిస్తేనే ఫైల్ ముందుకు సాగుతుందని తెలిసింది.’
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అటెండర్ నుంచి అధికారి వరకు 5,298 మంది ఉద్యోగులు, 1950 మంది పెన్షనర్లు ఉన్నారు. వారు తమ లావాదేవీలు, సెటిల్మెంట్ల కోసం జిల్లా ఖజానాశాఖ అధికారి కార్యాలయానికి రావాలి. గ్రాట్యుటీ, ఈఎల్, జీపీఎఫ్, జీఐఎస్ వంటి దాచుకున్న డబ్బులు, రుణాలు, పెన్షన్ మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈమేరకు ముందుగా ఉద్యోగి పనిచేసిన శాఖ జిల్లా అధికారి నుంచి ఆడిట్ చేయించి, జిల్లా ఖజానాశాఖ కార్యాలయానికి ఫైల్ పంపిస్తారు. అయితే ఖాజానా శాఖలో మాత్రం ప్రతీ పనికి కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
బిల్లులు ఇలా..
ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఖాజానా శాఖలో ఏపీ పేస్కేల్, తెలంగాణ పేస్కేల్, కొత్తగా ఏర్పడిన జిల్లా పేస్కేల్ వివరాలను పరిశీలించి బిల్లులు చేయాలి. అదే విధంగా ఉద్యోగంలో ఉన్నవారు మెడికల్, జీపీఎఫ్, రుణాలు, సెలవుల్లో పనిచేసిన డబ్బులు మొదలైనవి తీసుకునేందుకు ముందుగా ట్రెజరీలో అప్రూవల్ చేయించాలి. అయితే వీటిని పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే.. వెంటనే బిల్లులు చేసి జీఐ ఆఫీసుకు పంపించాలి. అప్పుడు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు విడుదల అవుతాయి. అయితే బిల్లులు చేసేందుకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిందే అన్నట్లు ఉద్యోగులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వచ్చే డబ్బులను బట్టి ఫైల్కు రూ. 4వేల నుంచి రూ. 15వేల వరకు ముట్టజెప్పందే పనికాదని ఉద్యోగులు అంటున్నారు
ఆరోపణలు వస్తున్నా..
ట్రెజరీ కార్యాలయంలో డబ్బులు ఇవ్వనిదే ఫైల్ ముందుకు కదలడం లేదని రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదని ఉద్యోగులు అంటున్నారు. అయితే ఆఫీసులో చాలా ఖర్చులు ఉంటాయి.. అందుకోసమే డబ్బులు తీసుకుంటున్నామని ఖాజానా శాఖ ఉద్యోగులు బహిరంగంగా చెప్పడం గమనార్హం. ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఇతర బిల్లులు చేయడంలో కమీషన్లు తీసుకునే వారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం.
బిల్లులు చేయడం కోసం వచ్చిన ఉద్యోగులు, పెన్షన ర్లను డబ్బులు అడుగుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేసి అక్రమాలకు పాల్పడడం, ఉద్యోగులను ఇబ్బందులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటా. అవసరం అయితే సెక్షన్లు మారుస్తాం.
– షరీఫ్ బాబా, టీడీఓ మహబూబాబాద్
●


