సోలార్‌.. కరెంట్‌ బిల్లు ఆదా! | - | Sakshi
Sakshi News home page

సోలార్‌.. కరెంట్‌ బిల్లు ఆదా!

Oct 17 2026 6:42 AM | Updated on Oct 17 2026 6:42 AM

నెహ్రూసెంటర్‌: గృహ విద్యుత్‌ వినియోగదారులు తమ ఇళ్లపై రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పా టు చేసుకుని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్‌ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడంతో పాటు సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేసుకునేందుకు పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ యోజన ఒక మంచి అవకాశమని సూచిస్తున్నారు.

విద్యుత్‌ బిల్లులకు చెక్‌..

ఇళ్ల పైకప్పులపై రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్లాంట్లు ఏర్పా టు చేసుకోవడం ద్వారా సూర్యరశ్మి సహా యంతో విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవచ్చు. తద్వారాఆ గ్రిడ్‌ నుంచి తీసుకునే విద్యుత్‌ వినియోగం తగ్గి, నెలవారీ విద్యుత్‌ బిల్లుపై గణనీయమైన ఆదా పొందే అవకాశం ఉంటుంది. సోలార్‌ ప్లాంట్‌ సామర్థ్యం, ఇంటి విద్యుత్‌ వినియోగం, సౌర విద్యుత్‌ ఉత్పత్తిని బట్టి విద్యుత్‌ బిల్లు జీరోకు చేరే అవకాశం కూడా ఉంటుందని అధికారులు వివరించారు. బ్యాంకులు త క్కువ వడ్డీ రేట్లకే రుణ సదుపాయం కల్పిస్తున్నాయ ని, నెలవారీ వాయిదాల రూపంలో చెల్లించే సదుపాయం కూడా అందుబాటులో ఉందని తెలిపారు.

కేంద్ర వ్యయం తగ్గుదల..

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీల వల్ల సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అయ్యే ప్రారంభ వ్యయం తగ్గుతుందని అధికారులు తెలిపారు. అర్హత, సాంకేతిక ప్రమాణాలు, పథకం నిబంధనలకు అనుగుణంగా సబ్సిడీ లభిస్తుందని పేర్కొన్నారు. 3 కిలోవాట్ల రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌ ద్వారా అనుకూల పరిస్థితుల్లో నెలకు 360 యూనిట్లకు పైగా విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. అయితే వాతావరణ పరిస్థితులు, పైకప్పుపై సూర్యరశ్మి లభ్యత, ప్లాంట్‌ పనితీరు ఆధారంగా ఉత్పత్తి మారుతుందని వివరించారు.

దరఖాస్తు ప్రక్రియ సులభం..

అర్హులైన గృహ విద్యుత్‌ వినియోగదారులు కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌ సైట్‌ పీఎం సూర్య ఘర్‌ ద్వారా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌, ఆమోదిత విక్రేత ఎంపిక, సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు, తనిఖీ, నెట్‌ మీటరింగ్‌, సబ్సిడీ పొందే ప్రక్రియను పథకం మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకునే ముందు తమ ఇంటి విద్యుత్‌ వినియోగం, అవసరమైన ప్లాంట్‌ సామర్థ్యం, పైకప్పుపై అందుబాటులో ఉన్న స్థలం, మొత్తం వ్యయం, సబ్సిడీ అర్హత వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు.

గృహ అవసరాలకు విద్యుత్‌ ఉత్పత్తి

పీఎం సూర్యఘర్‌ పథకంతో రాయితీలు

ప్రజలు వినియోగించుకోవాలని అధికారుల సూచన

ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు..

పీఎం సూర్య ఘర్‌ పథకం కింద అర్హులైన గృహ వినియోగదారులకు రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది.

కిలోవాట్‌ సోలార్‌ ప్లాంట్‌కు : రూ.30 వేల సబ్సిడీ

2కిలో వాట్‌ల సోలార్‌ ప్లాంట్‌కు : రూ.60 వేల సబ్సిడీ

3కిలోవాట్‌లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి : గరిష్ఠంగా రూ.78 వేల సబ్సిడీ

పర్యావరణ హితమైన విద్యుత్‌

రూఫ్‌ టాప్‌ సోలార్‌ వినియోగం ద్వారా సంప్రదాయ విద్యుత్‌ వనరులపై ఆధారపడడం తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడవచ్చు. ప్రతీ అర్హమైన గృహ విద్యుత్‌ వినియోగదారుడు పీఎం సూర్య ఘర్‌ పథకం ద్వారా అందుబాటులో ఉన్న ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి. – దర్శన్‌ కుమార్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement