ధాన్యం నిల్వలపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం నిల్వలపై దృష్టి

Oct 16 2026 1:12 AM | Updated on Oct 16 2026 1:12 AM

సాక్షి, మహబూబాబాద్‌: వానాకాలం ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే సేకరించిన ధాన్యం మిల్లులకు తరలించే విషయంపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏళ్ల తరబడి సీఎంఆర్‌ పెట్టకుండా కొన్ని, ధాన్యం నిల్వలను చూపించకుండా మరి కొన్ని.. అసలు ధాన్యం, బియ్యం లేకుండా ఉన్న మిల్లులు ఉన్నాయి. యాసంగి సీజన్‌లో తీసుకున్న ధాన్యం సీఎంఆర్‌ పెట్టడంలో పలువురు మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. వానాకాలం ధాన్యం నిల్వ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ధాన్యం కేటాయించకపోతే తమ పరిస్థితి ఏమిటని పలువురు మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.

కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఎంత వస్తుందో..

జిల్లాలో వానాకాలం సీజన్‌లో 1,93,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈమేరకు 4,40,672 మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యం, 24,160 మెట్రిక్‌ టన్నుల దొడ్డు రకం ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందులో 10శాతం అంటే 46,483 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల అవసరాలకు వినియోగం, 25శాతం అంటే 1,16,208 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్మే అవకాశం ఉందని అంచనా వేశారు. అవి పోగా 3,02,140 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు లెక్కలు వేశారు. ఈమేరకు 230 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా.. ఇందులో 199 సెంటర్లు సన్నధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటికే సన్నధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర, బోనస్‌ కలుపుకొని క్వింటాకు రూ.2,961 చెల్లిస్తున్నారు. కాగా, ప్రభుత్వం ముందుగా ప్రకటించిన ఏడు రకాల సన్నధాన్యాన్ని పైవేట్‌ వ్యాపారులు పొలం వద్దే క్వింటాకు రూ. 3వేల నుంచి రూ.4వేల వరకు ఖరీదు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో కొనుగోలు కేంద్రాలకు లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం కూడా రాకపోవచ్చని రైతులు చెబుతున్నారు.

ఖాళీ గోదాంల వేటలో అధికారులు..

వానాకాలం ధాన్యం మిల్లులకు కేటాయించకుండా.. నిల్వ చేసేందుకు స్థలం చూడాలని రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌ అధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఖాళీ స్థలాలు ఎక్కడ ఉన్నాయనే వేటలో అధికారులు ఉన్నారు. కాగా, గతంలో మక్కలు నిల్వ చేసిన గోదాంలు, మూతపడిన ఫంక్షన్‌హాల్స్‌, డిఫాల్ట్‌ రైస్‌ మిల్లులు, మూతపడిన సినిమా హాల్స్‌, ప్రైవేట్‌ కళాశాలల భవనాలు గుర్తించి తమకు అద్దెకు ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. ఇలా ఇప్పటికే జిల్లాలో 65వేల మెట్రిక్‌ టన్నుల వరకు నిల్వ చేసేందుకు గోదాంలు సిద్ధంగా ఉంచినట్లు తెలిసింది.

సీఎంఆర్‌ పెట్టకపోతే ఎలా..

రైతులు, వ్యాపారులు తెచ్చే ధాన్యం మరాడించి ఇవ్వడం, ధాన్యం కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు బియ్యం ఎగుమతులు చేయడం కోసం ఏర్పాటు చేసిన రైస్‌ మిల్లులు కొన్ని అయితే.. కేవలం ప్రభుత్వ సీఎంఆర్‌ కోసం ఏర్పాటు చేసిన రైస్‌ మిల్లులు కొన్ని ఉన్నట్లు ప్రచారం. ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి చేసుకొని సీఎంఆర్‌ పెట్టకుండా మొత్తం అమ్మేసిన వారు ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో బియ్యం పెట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే వానాకాలం ధాన్యం వస్తే త్వరగా పాత బకాయిల బియ్యం కోసం కొత్త ధాన్యం మిల్లింగ్‌ చేసి పెట్టవచ్చని భావించారు. కానీ, ప్రభుత్వం మిల్లులకు ఇవ్వకుండా తామే నిల్వ చేసే పనిలో ఉంది. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల్లో నిల్వలు, అలాట్‌మెంట్‌ విషయంపై అధికారులకు, మిల్లర్లకు చర్చలు జరగలేదు. ఈ పరిస్థితిలో ఏం జరుగుతుందో అని పలువురు మిల్లర్లు తలలు పట్టుకున్నారు. తమ మిల్లుకు సీఎంఆర్‌ అవకాశం ఇవ్వండి అని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

ఖాళీ గోదాంల గుర్తింపు పనిలో అధికారులు

సీఎంఆర్‌ జాప్యం, మొండి బకాయిల నేపథ్యంలో నిర్ణయం

ధాన్యం కేటాయించకపోతే

ఎలా అని మిల్లర్ల ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement