నిధుల కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

నిధుల కేటాయింపు

Oct 16 2026 1:12 AM | Updated on Oct 16 2026 1:12 AM

● రెండు పార్కుల కు రూ.కోటి మంజూరు

● మానుకోట మున్సిపాలిటీలో నిర్మాణాలు

● హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు

మహబూబాబాద్‌: ప్రజల ఆహ్లాదం, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మానుకోట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పార్కుల నిర్మాణానికి నిధులు కేటాయించారు. గాంధీ పార్కు స్థలంలో ఒక పార్కు, బ్రహ్మకుమారీస్‌ మందిరం సమీపంలో మరో పార్కు నిర్మాణం కోసం రూ.కోటి కేటాయించారు. దీంతో మానుకోట పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

లక్ష జనాభా..

మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు ఉండగా 65,712 మంది ఓటర్లు ఉన్నారు. విద్యా, ఉద్యోగం, వ్యాపారం రీత్యా నివాసం ఉండే వారితో కల్పితే లక్ష జనాభా దాటుతుంది. విలీన గ్రామాలతో విస్తీర్ణం కూడా పెరిగింది. కాగా స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ మానుకోట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.59.62 కోట్లు విడుదల చేయించారు. ఆ నిధులను వార్డుకు కనీసం రూ.30 లక్షలు.. గరిష్టంగా రూ.50 లక్షలు కేటాయించారు. ఆ నిధులతో వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే వరద కాల్వల కోసం రూ.12 కోట్లు, మినీట్యాంక్‌ బండ్‌ కోసం రూ.8 కోట్లు, ఇతరత్రా వాటికి నిధులు కేటాయించారు. ఈ నిధుల నుంచే పార్కుల నిర్మాణానికి కేటాయించారు.

రూ.కోటి నిధులతో..

జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున ఉన్న గాంధీపార్కు స్థలంలో ఒక పార్కు, బ్రహ్మకుమారీస్‌ మందిరం సమీపంలో మరో పార్కు నిర్మాణం కోసం కోటి రూపాయలు కేటాయించారు. ఇటీవల గాంధీపార్క్‌లో పనులు ప్రారంభమయ్యాయి. దానిలో వేదిక కోసం పనులు జరుగుతున్నాయి. పార్కులో ఆట వస్తువులు, అలంకరణ మొక్కలు, బెంచీలు, లైటింగ్‌, పెయింటింగ్‌, గ్రిల్స్‌, వాకింగ్‌ట్రాక్‌, మరుగుదొడ్లు ఇతర నిర్మాణాలు చేయనున్నారు. కాగా, బ్రహ్మకుమారీస్‌ మందిరం సమీపంలో స్థలం గుర్తించినప్పటికీ రెవెన్యూ అధికారులు నేటికీ కేటాయించలేదు. దీంతో అక్కడ పనులు ప్రారంభం కాలేదు. ఈ రెండు పార్కులను ఎన్‌ఎండీ కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు అప్పగించారు. కాగా మరో పార్కుకు స్థలం కేటాయిచాలని సదరు కాంట్రాక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు.

అవి పూర్తయితే..

మానుకోట మున్సిపాలిటీలో ఇప్పటి వరకు ఏడు పార్కులు, 9 ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మంజూరైన రెండు పార్కులు పూర్తయితే పట్టణంలో పార్కుల సంఖ్య 9కి చేరుతుంది. విస్తీర్ణం, జనాభాతో పోల్చుకుంటే పార్కుల సంఖ్య తక్కువైనప్పటికీ.. నూతన నిర్మాణాల విషయంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గాంధీపార్క్‌ ప్రజలకు సౌలభ్యం..

జిల్లా కేంద్రం నడ్డిబొడ్డున ఉన్న నూతన పార్కు పనులు పూర్తయితే ప్రజలకు చాలా సౌలభ్యంగా ఉంటుంది. పక్కనే రైల్వేస్టేషన్‌ ఉండడంతో రైళ్లు ఆలస్యంగా ఉంటే ప్రయాణికులు అక్కడ సేదదీర వచ్చు. వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. జిల్లా కేంద్రం ప్రధాన సెంటర్‌ కూడా అదే కావడంతో ఆప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

నిర్వహణేది?

కోట్లాది రూపాయల ప్రజాధనంతో పార్కులు, జిమ్‌ల నిర్మాణాలు చేస్తున్నారు. మున్సిపాలిటీని అధికారులు వాటి నిర్వహణను మాత్రం గాలికి వదిలేశారు. పార్కులు, జిమ్‌లలో ఉన్న ఆట వస్తువులు చాలా వరకు పాడైపోయాయి. జిమ్‌ పరికరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మున్సిపల్‌ అఽధికారులు ప్రత్యేక దృష్టి పెడితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement