● కలెక్టర్ స్నేహశబరీష్
గూడూరు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూముల రీ సర్వే కొనసాగించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. మండలంలోని బొద్దుగొండలో గురువారం ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు మధనాపురంలో భూముల రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ మండల కేంద్రంలోని సీహెచ్సీని తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వేలో ముందస్తుగా రైతులకు సమాచారం అందించాలని, రైతులు కూడా తమ భూముల హద్దులను ఏర్పాటు చేసుకోవాలని, దీంతో సర్వే పారదర్శకంగా కొనసాగుతుందని సూచించారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో రైతులు పంటమార్పిడి చేసుకోవాలని, తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేయాలని కోరారు. వీబీజీ రామ్జీ పథకం కింద రైతులకు వివిధ పనులను అప్పగించాలని సంబంధిత ఎఫ్ఏలను ఆదేశించారు. సాగు, తాగు నీరు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, పీఏసీఎస్ ద్వారా అర్హత కలిగిన రైతులకు రుణాలు అందించాలని సూచించారు.
వైద్యులు, సిబ్బంది సమయపాలన
పాటించాలి..
మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లల వార్డు, సీ్త్ర, పురుషుల వార్డులను, మందుల స్టోర్ గదిని, హాజరు పట్టిక, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం వైద్యులు, సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగభవాని, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ చీర శ్రీనివాసులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరేష్రెడ్డి, సర్వేయర్లు పాల్గొన్నారు.


