● మాజీ ఎంపీ మాలోత్ కవిత
మహబూబాబాద్/నెహ్రూసెంటర్: ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎంపీ మాలోత్ కవిత డిమాండ్ చే శారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సమ్మె చేపట్టారు. గురువారం మాజీ ఎంపీ కవిత సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగులకు కేడర్ ఫిక్సేషన్ అమలు చేయాలన్నారు. వందశాతం బేసిక్ శాలరీ చెల్లించాలని, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి రాష్ట్ర హెల్త్ సొసైటీ ద్వారా వేతనాలు నేరుగా చెల్లించాలన్నారు. సంవత్సరానికి 5శాతం ఇంక్రిమెంట్ బోనస్ కల్పించాలని, మహిళా ఉద్యోగులకు 180రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రతతో పాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మెతోనైనా ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల జేఏసీ నాయకులు ఉమాకర్, శ్రీకాంత్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


