శాయంపేట : మండలంలోని కొత్తగట్టు సింగారం స్టేజి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కర్రలోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీ కొట్టడంతో కర్ర వ్యాపారి (ట్రాక్టర్ డ్రైవర్) అక్కడిక్కడే మృతిచెందాడు. ఎస్సై జక్కుల పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతయ్యపేట గ్రామానికి చెందిన యెజ్జల శ్రీను (25) తన సోదరుడు నాగేశ్‌తో కలిసి స్థానికంగా కర్ర వ్యాపారం చేస్తున్నారు. వారికి సొంతంగా ట్రాక్టర్ ఉంది. శ్రీను ట్రాక్టర్ కూడా నడుపుతాడు. శుక్రవారం తెల్లవారుజామున మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటనుంచి వేపకర్ర లోడును ట్రాక్టర్‌లో వేసుకుని తనే నడుపుకుంటూ పరకాల మీదుగా వరంగల్‌కు తీసుకెళ్తున్నాడు. కొత్తగట్టు సింగారం స్టేజి సమీపంలోకి రాగానే పరకాలనుంచి హనుమకొండకు వెళ్తున్న లారీ ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ టేలర్‌లో ఉన్న కర్ర.. శ్రీనుపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. తన తమ్ముడి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని అన్న నాగేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేష్ తెలిపారు.


