మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్, తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శుక్రవారం డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్‌తో కలిసి పరిశీలించారు. ట్రాక్ రెన్యువల్ ట్రైన్ (టీఆర్టీ) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే భారీ యంత్రమని, ఒకే పని విభాగంలో ట్రాక్ నిర్వహణకు సంబంధించిన పలు పనులను ఈ యంత్రం సమర్థవంతంగా నిర్వహిస్తుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ యంత్రం పాత రైలు పట్టాలను తొలగించడం, పాత స్లీపర్లను బయటకు తీయడం, ట్రాక్ అడుగుభాగంలోని కంకరను సరిచేయడం, కొత్త స్లీపర్లను అమర్చడం వంటి పనులను చేపడుతుందని తెలిపారు. ప్రత్యేకంగా అమర్చిన ఫ్లాట్ వ్యాగన్ల నుంచి కొత్త స్లీపర్లను తీసుకుని వాటిని పట్టాల కింద అమర్చుతుందన్నారు. అనంతరం రైలు పట్టాలను తిరిగి అమర్చి, కంకరను సర్దుబాటు చేసి ట్రాక్‌ను పటిష్టం చేస్తుందని తెలిపారు. ఈ యంత్రం ద్వారా ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తవుతాయని, రైళ్ల రాకపోకలకు కలిగే అంతరాయం తగ్గడంతోపాటు సమయం ఆదా అవుతుందన్నారు. ముఖ్యంగా సాధారణ క్రేన్ల వినియోగం, మానవ శ్రమపై ఆధారపడటం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.


