మిషన్ భగీరథకు ప్రత్యామ్నాయంగా నేటికీ మున్నేరు వాగు
మహబూబాబాద్: దశాబ్దాల పాటు మానుకోటకు మున్నేరు వాగు నుంచే తాగునీరు అందింది. మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్య తలెత్తితే మున్సిపల్ అధికారులు మున్నేరు వాగుపైనే ఆధారపడతారు. అయితే తులారాం ప్రాజెక్ట్ నుంచి కుడి కాల్వ నిర్మిస్తే సాగు, తాగు నీటి కష్టాలు గట్టెక్కుతాయని పలు పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. కానీ కాల్వ నిర్మాణం జరగలేదు. ఇదిలా ఉండగా.. వాగుపై ఉన్న లోలెవల్ బ్రిడ్జి శిథిలాసవస్థకు చేరడంతోపాటు కొంత భాగం కొట్టుకుపోవడంతో ప్రమాదకరంగా మారింది.
మిషన్ భగీరథకు ప్రత్యామ్నాయంగా..
గూడూరు మండలం నుంచి మానుకోట, డోర్నకల్ మండలం వరకు ఉన్న ఈ వాగు నుంచే మానుకోట మున్సిపాలిటీకి తాగు నీరు అందించారు. అయితే ప్రస్తుతం మిషన్ భగీరథ అందుబాటులోకి వచ్చాక సరఫరాలో ఇబ్బందులు ఏర్పడితే.. మానుకోట మున్సిపాలిటీ అధికారులు మున్నేరు వాగులోని పంపు హౌజ్ నే ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఇదిలా ఉండగా.. వాగుపై నిర్మించిన రెండు చెక్‌డ్యాంలతో సుమారు 300 ఎకరాలపైనే వాగు నీరు సాగుకు ఉపయోగపడుతుందని ఇరిగేషన్ ఏఈ కల్యాణ్ తెలిపారు.
ప్రమాదకరంగా లో లెవల్ బ్రిడ్జి
వాగుపై లో లెవల్ బ్రిడ్జి మాత్రమే ఉన్నసమయంలో వరద ఉధృతి పెరిగితే మానుకోట.. గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయేవి. కొన్ని సంవత్సరాల క్రితం వరద ఉధృతితో కొంత భాగం కొట్టుకుపోయింది. దీంతో వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మించారు. అయితే కొట్టుకుపోగా మిగిలిన లో లెవల్ బ్రిడ్జిని తొలగించకపోవడంతో దానిపై కూడా ప్రజలు ప్రమాదకరంగానే రాకపోకలు సాగిస్తున్నారు. వాగులో ప్రవాహం పెరిగినప్పుడు చూసేందుకు లో లెవల్ బ్రిడ్జిపైకి వస్తున్నారు. అయితే లో లెవల్ బ్రిడ్జిని పూర్తి తొలగించకపోవడంపై ఆయా శాఖలు వేర్వేరుగా వాదిస్తున్నాయి. ఇరిగేషన్ శాఖ అధికారులు ఆ బ్రిడ్జిలతో సంబంధం లేదని చెబుతుండగా.. ఆ రోడ్డు ఎన్‌హెచ్ పరిధిలో పోయిందని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు. ఎన్‌హెచ్ అధికారులు కూడా స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా.. అనే ప్రశ్ర ప్రజల నుంచి ఉత్పన్నమవుతుంది.
కాల్వ నిర్మించాలని ఆందోళనలు..
బయ్యారం మండలం గౌరారం గ్రామ శివారు వినోభా నగర్ సమీపంలో తులారాం ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టు నుంచి కుడి కాల్వ నిర్మించి మున్నేరు వాగుకు కలపాలని వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో గతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో సాగు నీటి కష్టాలు గట్టెక్కుతాయని, ఆ వాగు వద్ద ఆఫ్ టీఎంసీ రిజర్వాయర్ నిర్మిస్తే తాగు నీటి సమస్య తీరుతుందని ఆయా పార్టీల అభిప్రాయం.
ప్రమాదకరంగా లోలెవల్ బిడ్రి
తులారం ప్రాజెక్ట్ కుడి కాల్వతో తీరనున్న సాగు కష్టాలు


