ఖానాపురం : నర్సంపేట మండలంలోని భోజ్యనాయక్ తండా శివారు వాగులో సోమవారం మొసలి ప్రత్యక్షమైంది. గమనించిన స్థానిక రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్‌ఆర్‌ఓ నరేష్ బసవ ఆదేశాలతో వాగు వద్దకు బీట్ ఆఫీసర్ వెంకన్న, సిబ్బందితో వెళ్లి మొసలిని బంధించి ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులో వదిలేశారు. కార్యక్రమంలో బేస్ క్యాంప్ సిబ్బంది నాగరాజు, విజయ్, ప్రకాశ్, జగ్గారావు ఉన్నారు.
గ్రాడ్యుయేట్ ఓటరుగా
నమోదు చేసుకోవాలి
హన్మకొండ : ఉమ్మడి నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రారంభమైన ఓటరు నమోదు ప్రక్రియను అర్హత ఉన్న పట్టభద్రులు వినియోగించుకోవాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి సోమవారం విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ నవంబర్ 6వ తేదీతో ముగియనుందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. ఇది కేవలం ఓటరు నమోదు ప్రక్రియ మాత్రమే కాదని ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక ఆయుధం.. మన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక అస్త్రం.. డిమాండ్లను సాధించుకోవడానికి ఒక అవకాశం.. మన కోసం పోరాడే వారికి ప్రజాస్వామ్య పద్ధతిలో మద్దతు తెలియజేయడానికి ఒక మార్గం అని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.


