ములుగు : పిల్లలు బరువు తగ్గకుండా, పోషకాహార లోపానికి గురికాకుండా ముందస్తుగా సంరక్షించేందుకు ‘తొలిముద్ద’ దోహదపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. సోమవారం ములుగు కలెక్టరేట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ‘తొలిముద్ద’ అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జిల్లాలో చిన్నారులకు పాలను అందిస్తున్నామని, ఇకపై పాలు, గుడ్లు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం ద్వారా సంపూర్ణ పోషకాహారం లభిస్తుందని తెలిపారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ.. చిన్నారులకు అల్పాహారం అందించే ‘తొలిముద్ద’ కార్యక్రమానికి ములుగు జిల్లా ఎంపిక కావడం సంతోషకరమన్నారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్లకు ‘తొలిముద్ద’ అల్పాహార కిట్లను మంత్రి సీతక్క, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి అందజేశారు. బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా కిశోర బాలికలకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి, మున్సిపల్ చైర్ పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్ పర్సన్ ఆసియా షాహిన్, ఆత్మ కమిటీ ప్రతినిధులు రఘు, రవీందర్ రెడ్డి, అరుణ, ప్రాంతీయ సంయుక్త సంచాలకురాలు కృష్ణవేణి, జిల్లా రెవెన్యూ అధికారి రవికుమార్, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, సీడీపీఓ శిరీష, ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ టీచర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క


