చేయూత అందేనా | - | Sakshi
Sakshi News home page

చేయూత అందేనా

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

పింఛన్‌ వస్తుందో రాదో అని అర్హుల ఆందోళన

సాక్షి, మహబూబాబాద్‌: జిల్లాలో అర్హులు చేయూత పింఛన్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, అధికారులు అర్హుల జాబితాలో పేర్లు వచ్చిన వారి ఇంటికి వెళ్లి సర్టిఫికెట్లు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని అర్హతలు ఉన్నవారిని కూడా ఇబ్బందులు పెడుతున్నట్లు సమాచారం. విచారణకు వచ్చే అధికారుల్లో కొందరు సర్టిఫికెట్లు చూసి ఇవి పనికి రావని, మీరు పింఛన్‌కు అర్హులు కాదని చెబుతుండడంతో అన్ని అర్హతలు ఉన్న దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దివ్యాంగుల్లో ఉత్కంఠ

చేయూత పింఛన్‌ దరఖాస్తుల పరిశీలన ఈనెల 30 వరకు ముగియనుంది. కాగా, ప్రభుత్వం జారీ చేసిన దివ్యాంగ సర్టిఫికెట్‌ కాలపరిమితి ముగిసిన వారు ఉన్నారు. అయితే ఆ సర్టిఫికెట్‌లతోనే పలువురు దివ్యాంగులు చేయూత పింఛన్‌ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం అధికారులు వారి ఇంటికి వచ్చి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో దివ్యాంగ సర్టిఫికెట్‌ కాలపరిమితి ముగిసిందని, రెన్యూవల్‌ చేసుకుంటేనే పింఛన్‌ వస్తుందని అధికారులు చెప్పి వెళ్లిపోయారు. కాగా, రెన్యూవల్‌ కోసం ఽఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం, అధికారులు సదరం క్యాంపు పెట్టడం, తర్వాత సర్టిఫికెట్‌ జారీ చేయడం వంటి ప్రక్రియ పూర్తి అయ్యేవరకు సుమారు 20రోజులకు పైగా పడుతుంది. ఈనెల 30వరకు విచారణ గడువు ముగుస్తుంది. ఆలోపు సర్టిఫికెట్‌ రాదని, దీంతో తమ పింఛన్‌ పోతుందని దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. దివ్యాంగులకు త్వరగా క్యాంపులు పెట్టడం, అర్హులైన వారికి సర్టిఫికెట్‌ ఇచ్చేవరకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

పైలేరియా బాధితుల్లో

ఆందోళన..

చేయూత పింఛన్‌ దరఖాస్తులతో పాటు, పైలేరియా బాధితుల నుంచి కూడా దరఖాస్తులు తీసుకున్నారు. కాగా, సదరు డాక్టర్‌ సర్టిఫికెట్‌తో పాటు, జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ప్రత్యేక పరిశీలన కేంద్రం ఏర్పాటు చేసి అక్కడికి వచ్చిన బాధితులను పరిశీలించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇలా జిల్లాలో 1,320 మేరకు దరఖాస్తులు వచ్చాయి. అయితే గ్రామాల్లో చేయూత పింఛన్‌ మంజూరు కోసం విచారణ అధికారులు ఇంటింటికీ రావడంతో.. తాము చేసుకున్న దరఖాస్తు ఏమైందని.. తమ వద్దకు విచారణ అధికారులు రావడం లేదని పైలేరియా బాధితులు ఆందోళన చెందుతున్నారు. అయితే డాక్టర్‌ పరిశీలన పూర్తి అయ్యిందని, నేరుగా పింఛన్‌ మంజూరు అవుతుందని కొందరు చెబుతుండగా.. విచారణకు ఇంటికి వస్తారని మరికొందరు చెబుతున్నారు. దీంతో చివరకు పింఛన్‌ వస్తుందా రాదా అని పైలేరియా బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దరఖాస్తుదారుల సర్టిఫికెట్లు పరిశీలిస్తున్న అధికారులు

ధ్రువపత్రాలపై అనుమానం వ్యక్తం చేస్తున్న వైనం

చిన్నచిన్న తప్పులు సరిచేయకుండా తిరస్కరణ

ఆందోళన అవసరం లేదు

అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛన్‌ మంజూరు చేస్తారు. దరఖాస్తుతో ఇచ్చిన సర్టిఫికెట్ల పరిశీలన, వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు అధికారులు నేరుగా లబ్ధిదారుడి ఇంటికి వెళ్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన 360 డిగ్రీల యాప్‌ ద్వారా దరఖాస్తుదారుల ఆర్థిక, ఆస్తుల వివరాలు తెలుస్తాయి. అయితే ఇందులో తప్పులు ఉంటే.. వాటిని తిరస్కరించకుండా హోల్డ్‌లో పెట్టమని చెప్పాం. మరోసారి వాటిని పరిశీలించి అర్హులైతే పింఛన్‌ మంజూరు చేస్తారు.

– మధుసూదన్‌ రాజు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement