మహబూబాబాద్: ప్రజావాణిలో స్వీకరించిన వినతులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ స్వయంగా వినతులు స్వీకరించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణిలో స్వీకరించిన ప్రతీ అర్జీని సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ ఆన్‌లైన్ ముఖచిత్ర హాజరు నమోదు చేసుకోవాలన్నారు. గురుకుల హాస్టళ్లు, ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు కావాల్సిన ప్రతిపాదనలు సత్వరమే అందజేయాలన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కాగా ప్రజావాణిలో 93 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, డీఆర్వో నాగలక్ష్మి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
వచ్చిన వినతుల్లో కొన్ని..
కేజీబీవీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్న జీసీడీఓ గాయత్రిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మధు, నాయకులు అమీర్, నవీన్, సాయికుమార్ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. నాయకులు ఎల్ది మల్లయ్య, శ్యాంసుందర్‌శర్మ, రేష్మా, ప్రతాప్‌రెడ్డి, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు
తొర్రూరు మండలం వెలికట్టె గ్రామపంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని పలువురు వార్డు సభ్యులు వినతి పత్రం అందజేశారు.
కలెక్టర్ స్నేహశబరీష్


