కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు బారులుదీరారు. స్వామి వారితో పాటు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఆలయ అధికారులు సౌకర్యాలు కల్పించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు చిరస్మరణీయం
డీఆర్వో నాగలక్ష్మి
మహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్: కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన త్యాగాలు చిరస్మరణీయమని డీఆర్వో నాగలక్ష్మి కొనియాడారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో ఆదివారం వెనుకబడిన తరగతుల అభివృద్ధ్దిశాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి డీఆర్వో నాగలక్ష్మి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ చూపిన ధైర్య సాహసాలు, స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ జిల్లా అధికారి సాయి శ్రీజ, జిల్లా అధికారులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ప్రయాణికుల కోసం
ఆర్టీసీ విచారణ నంబర్
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ డిపో పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాండ్ విచారణ నంబర్‌ను అందుబాటులో తీసుకువచ్చినట్లు డిపో మేనేజర్ వి.కల్యాణి ఆదివారం తెలిపారు. మహబూబాబాద్ బస్టాండ్ నుంచి వివిధ రూట్లలో బస్సులు వెళ్లే సమయం, ఆర్టీసీ బస్సులకు సంబందిన వివరాలను ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. 85003 24880 నంబర్‌కు ఫోన్‌చేసి బస్సుల వివరాలను పొందవచ్చని, 24 గంటలు బస్సు విచారణ నంబర్ అందుబాటులో ఉంటుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
‘వెంటనే పీఆర్సీ చెల్లించాలి’
మహబూబాబాద్ అర్బన్: కాలయాపన చేయకుండా వెంటనే పీఆర్సీ చెల్లించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ మల్లారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మా ట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ రిపోర్ట్ తక్షణమే తెప్పించుకొని జూలై 2023 నుంచి అమలు చేయాలన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బులు ఇవ్వాలని, ప్రాథమిక పాఠశాల ల ఉపాధ్యాయులపై పని ఒత్తిడిని తగ్గించి, తరగతికి ఒక టీచర్‌ను నియమించాలన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి యాకూబ్, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శులు బధ్రునాయక్, జనార్దనచారి, హుస్సేన్‌నాయక్, మంజుల, హరినాయక్, రమేశ్, సంజీవ తదితరలు పాల్గొన్నారు.
గర్భగుడి మండపం
పనులు ప్రారంభం
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఆదివారం ప్రధాన ఆలయం గర్భగుడి మండపం పునాది పనులు మొదలయ్యాయి. 12ఫీట్ల మేర లోతుతో మట్టిని తీశారు. శ్రీశుభానందదేవి మండపానికి కూడా మట్టిని తోడారు. గర్భగుడి పునాది పనులు నాలుగు దిక్కులా రాయితో కూలీలు నిర్మాణం చేస్తున్నారు. ఆదివారం ప్రాకారాల పనులకు అందులో వివిధ ఆలయానికి సంబంధించిన సామగ్రి ఉండడంతో నిలిచింది. శివకల్యాణ మండపం రేకుల షెడ్డును పూర్తిగా తొలగించారు.


