న్యూస్‌రీల్
కన్న కలలు ఫలించాయి
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన నోముల పార్వతి–యాకయ్యలది వ్యవసాయధార కుటుంబం. సమాజంలో విద్య లేకపోతే ఎదురయ్యే ఇబ్బందులను స్వయంగా అనుభవించిన ఆ దంపతులు కూతురిని సమాజానికి ఉపయోగపడే ఉన్నత స్థానంలో చూడాలని కలలు కన్నారు. వారి కాష్టాన్ని, త్యాగాలను అర్దం చేసుకున్న అశ్విని ఆహర్నిశలు శ్రమించి ఏడాది క్రితం వనపర్తి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. విజయవంతంగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ‘కూతురు న్యాయమూర్తి కావాలన్న మా అశను తను నెరవేర్చింది. ఏడాది కాలంగా జడ్జిగా సేవలు అందిస్తున్న మా బిడ్డను చూస్తేంటే కడుపు నిండిపోతుంది. కూతుర్ల దినోత్సం వేళ ఒక కూతురిగా తను మాకు ఇచ్చిన అతి పెద్ద బహుమతి’అని అశ్విని తల్లిదండ్రులు పార్వతి, యాకయ్య ఎంతో ఆనందంగా తెలిపారు.
నా భవిష్యత్‌ను నిర్మించారు
మహబూబాబాద్ రూరల్ : ఈ కుమార్తెల దినోత్సవం సందర్భంగా నా జీవితంలో నాకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులైన నా తల్లిదండ్రులు భూక్యా భీమా, మంజుల గురించి కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. నా తల్లిదండ్రులకు పాఠశాల విద్యను అభ్యసించే అవకాశం లభించలేదు. అయినప్పటికీ, కష్టపడి పనిచేస్తూ నా భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేశారు. వారి ప్రోత్సాహం, త్యాగాల వల్లనే నేను హైదరాబాద్లోని సీబీఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ) పూర్తి చేయగలిగా. అమెరికాకు చెందిన ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో నాలుగేళ్ల పాటు బిజినెస్ అనలిస్టుగా పనిచేశాను. నా తల్లిదండ్రుల పూర్తి మద్దతుతో కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేశాను. చివరకు విజయం సాధించి 2017 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారిగా సేవలో చేరాను. మా కుటుంబంలో మొదటి తరం అధికారిగా నిలవడం నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఈ రోజు కుమార్తెలను గౌరవించే రోజు. కానీ నా విజయానికి సంబంధించిన ప్రతీ గౌరవం నా తల్లిదండ్రులకే చెందుతుంది.
– భూక్య లావణ్య, మానుకోట జిల్లా అటవీశాఖ అధికారి
తాము చదువుకోలేక ఎదుర్కొన్న కష్టాలు తమ బిడ్డ పడకూడదని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. తాము చిందించిన ప్రతీ చెమట చుక్కను కూతుళ్ల భవిష్యత్తుకు పునాదిగా మార్చారు. మరికొందరు తల్లిదండ్రులు కొడుకు లేడని బాధపడలేదు. కూతుళ్లనే వారు కుమారులుగా భావిస్తూ ఉన్నతస్థానాలకు వెళ్లాలని ఆశపడ్డారు. వారి నమ్మకాన్ని కూతుళ్లు నిలబెట్టారు. ఉన్నతస్థానాలకు ఎదిగి తల్లిదండ్రుల పేరు నిలబెట్టారు. నేడు (ఆదివారం) కూతుళ్ల దినోత్సవం (డాటర్స్ డే) సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తల్లిదండ్రుల కల నెరవేర్చిన కూతుళ్లు, కూతుళ్ల కోసం కష్టపడిన తల్లిదండ్రులపై ప్రత్యేక కథనాలు.
దేవుడిచ్చిన కూతురు..
నా పేరు సుమన్. నేను ఈఏడాది మార్చిలో మహబూబాబాద్‌లోని లండన్ కిడ్స్ పాఠశాలలో ఇన్‌చార్జ్‌గా జాయిన్ అయ్యాను. నా పూర్వ విద్యార్థిని ఇప్పుడు అదే పాఠశాలలో టీచర్‌గా విధుల్లో నిర్వర్తిస్తుంది. ఆమె పేరు పావని. జూన్ 21 (ఆదివారం) ఫాదర్స్ డే నాడు ఉదయమే పావని నాకు ఫోన్ చేసింది. సార్ స్కూల్‌కు వస్తున్నారా.. అని అడిగింది. వస్తున్నా అన్నాను. స్కూల్‌కి వచ్చేలోగా.. నా బెంచ్ మీద కేక్.. దాని మీద హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని రాసి ఉంది. ఎవరిది ఈ కేక్ అనగానే.. మిమ్మల్ని నాన్న అని పిలువచ్చా సార్ అంటూ పావని దగ్గరకు వచ్చింది. హ్యాపీగా ఒకే చెప్పాను. ఫ్రెండ్‌షిప్ డే, రాఖీ ఇలా అన్ని నాతోనే సెలబ్రేట్ చేసుకుంటుంది. బెస్ట్ టీచర్ అవార్డు అందుకుని నా వద్దకు వచ్చి తన శాలువాను నాకు కప్పి అవార్డు నా చేతిలో పెట్టింది. నా సంతోషానికి హద్దు లేదు. సొంత కూతురు ఉన్నా.. ఇలా చేసేదోకాదో అనిపించింది. సభలో ఉన్న టీచర్స్ సుమన్ సార్ మీకు ఇంత పెద్ద కూతురు ఉందా.. అని అడిగితే అప్పుడు చెప్పాను.. ఉంది.. పావని నాకు దేవుడు ఇచ్చిన కూతురు అని.
నలుగురు కుమార్తెలు ఉద్యోగస్తులే..
ఏటూరునాగారం: మాది రైతు కుటుంబం. ఎన్నో కష్టాలు పడి మా తల్లిదండ్రులు నన్ను పెంచి పెద్దచేశారు. ఇంటర్ వరకు చదువుకున్నాను. 19 సంవత్సరాలకే జైలు వార్డెన్ ఉద్యోగం వచ్చింది. పోలీసులను మావోయిస్టులు చంపుతున్నారని తల్లిదండ్రులు పోలీసులు ఉద్యోగానికి పంపలేదు. నాకు నలుగురు కుమార్తెలు. ప్రభుత్వ పాఠశాలలో చదివించి ఇంటి వద్ద నేనే ట్యూషన్ చెప్పేవాడిని. ఆ తర్వాత నా రెండో కుమార్తె ప్రసన్న లక్ష్మీని డిప్లామా అగ్రిలక్చర్ చదివించగా ఏఈఓగా ఉద్యోగం వచ్చింది. పెద్ద కుమార్తె పద్మ ఏఎన్‌ఎంగా ములుగు ఏరియా ఆస్పత్రిలో థియేటర్ అసిస్టెంట్‌గా ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తోంది. మూడో కుమార్తె ప్రియాంకకు ములుగు ఏరియా ఆస్పత్రిలో ల్యాబ్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. నాలుగో కుమార్తె రజిత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రాగా ప్రస్తుతం హైదరాబాద్‌లోని హెడ్ క్వార్టర్స్‌లో వెటర్నరీ ల్యాబ్ టెక్నిషియన్‌గా ఉద్యోగం చేస్తోంది. నలుగురు కుమార్తైలెనా అధైర్యపడకుండా ప్రయోజకులను చేశా. వారు నా నమ్మకాన్ని నిలబెట్టడం తండ్రిగా ఎంతో సంతృప్తినిచ్చింది.
– గోగు నగేశ్, ఏటూరునాగారం, ములుగు జిల్లా
ఇద్దరు ఆడపిల్లలు డాక్టర్లే..
కాశిబుగ్గ: వరంగల్ దేశాయిపేటకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి గాండ్ల ప్రభాకర్–రమాదేవికి ఇద్దరు కుమార్తెలు మౌనిక, మేఘన. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్నా చింత లేకుండా వారిని చదివించారు. పెద్దమ్మాయి మౌనిక కేఎంసీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో పిడియాట్రిక్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉస్మానియా పరిధిలోని నీలోఫర్ ఆస్పత్రిలో డీఎం నియోనెటాలజీగా పనిచేస్తున్నారు. అదేవిధంగా చిన్నమ్మాయి మేఘన కూడా తానేమి తీసిపోనట్లుగా ఒంగోలులోని రిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం గుంటూరులోని మెడికల్ కాలేజీలో ఆప్తాల్మాజీలో సెకండియర్ చదువుతున్నారు. ‘మాకు కొడుకులు లేరన్న చింత లేదు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా లక్ష్మీదేవిలుగా భావిస్తూ కష్టపడి చదివించాం. డాక్టర్లు కావడంతో మా జన్మ ధన్యమైంది.’అని తల్లిదండ్రులు ప్రభాకర్–రమాదేవి సగర్వంగా చెప్పారు.
కూతురును చూసి గర్వపడుతున్నాం..
హన్మకొండ : నిన్నుచూసి మేము తల్లి–దండ్రులుగా ఎంతో గర్వపడుచున్నాం. కూతురు సహనా రెడ్డి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటా ఆనందం పొందుతున్నాం. విద్య అనేది భవిష్యత్‌ను మార్చే శక్తి అని ధృడంగా నమ్మి మా కూతురును చదివించాం. కాకతీయ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కూల్ ఎంబీఏ పూర్తి చేసింది. మల్టీ నేషనల్ ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ కంపెనీలో ఏడాదికి రూ.75 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తూ సమాజంలో ఉన్నత స్థాయిలో నిలవడం మాకెంతో గర్వకారణం. మా ఆనందం.. ఆశలకు ప్రతీక అయిన నీవు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నతశిఖరాలను అధిరోహించాలని, నేటి సమాజానికి మార్గదర్శకురాలిగా నిలవాలని కోరుకుంటున్నాం. – గోపు రేణుకారెడ్డి – సమ్మిరెడ్డి, హనుమకొండ
వారి ఆశలను వమ్ము చేయకుండా నెరవేర్చిన కూతుళ్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నతస్థానాలకు ఎదిగిన పలువురు
అమ్మనాన్నల రెక్కల కష్టం.. కూతుళ్ల విజయాల ఆకాశం
చదువుకోలేదన్న వెలితిని.. పిల్లల చదువుతో తుడిచేసుకున్న
తల్లిదండ్రులు


