జనగామ: గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో మధ్యలోనే నిర్మాణాలు నిలిచిన ఇళ్లను గుర్తించి వాటిని పూర్తి చేసి పేద కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్‌లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమ సభలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి మంత్రి మాట్లాడారు.. ఒక్క జనగామ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో నిర్మాణాలు పూర్తికాక ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తిస్తున్నామని చెప్పారు. జనగామకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. జనగామ జిల్లాలో సుమారు 500 కుటుంబాలు పూరి గుడిసెల్లో నివసిస్తున్నాయని, వచ్చే దసరా నాటికి ఇందులో అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేలా మంజూరు చేస్తామని ప్రకటించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా మొండి గోడల వద్ద, స్లాబ్ స్థాయిలో నిర్మాణాలు నిలిచిపోయిన ఇళ్లను కూడా పరిశీలించి రూ.2లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సాయం అందిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు దసరా నాటికి రూ.25 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులను వెంటనే మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం 500 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి నాయక్, వైటీడీఏ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పూరిగుడిసెల కుటుంబాలకు రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు
జనగామ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి


