ఏటూరునాగారం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద శనివారం 13.8 మీటర్ల నీటి మట్టం నమోదైంది. తుపాకులగూడెం నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో ఏటూరునాగారంలో గోదావరి ప్రవాహం మరింత పెరిగింది. దీంతో ముందస్తుగా ఇరిగేషన్ అధికారులు ఏటూరునాగారం ఓడవాడ నుంచి రామన్నగూడెం, రాంనగర్, పప్కాపురం వైపు ఉన్న 19 గేట్లను మూసివేశారు. వరద నీరు వచ్చినా గేట్ల ద్వారా గ్రామాల్లోకి వెళ్లకుండా తగు చర్యలు చేపట్టారు. గోదావరి ప్రవాహం మరింత పెరిగినా ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ఇటీవల నిర్మించిన జియోట్యూబ్స్‌కు వరద నీరు వచ్చి తాకుతోంది.
వాజేడు: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో గోదావరి వరద క్రమేపీ పెరుగుతుంది. దీంతో 163 జాతీయ రహదారి ములుగు జిల్లా వాజేడు మండలంలోని టేకులగూడెం, ఇసుక వాగు వద్ద ముంపునకు గురైంది. ఫలితంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రా ష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచాయి. అదే విధంగా మండల పరిధిలోని పెద్ద గొల్లగూడెం, చీకుపల్లి గ్రా మాల మధ్య ఇసుక వాగు బ్రిడ్జి నిర్మాణ ప్రదేశంలో ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు ముంపునకు గురైంది. దీంతో వాగుఅవతలి వైపున ఉన్న 25 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచాయి. కొందరు ప్రయాణికులు వరద నీటి నుంచి కాలినడకన వస్తున్నారు.
మేడిగడ్డకు 72,270 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
కాళేశ్వరం: జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 72,270 క్యూసెక్కుల నీరు తరలి వస్తున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో శనివారం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత నది 6.030 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహిస్తోంది. ఈ వరదంతా దిగువన మేడిగడ్డ బ్యారేజీకి చేరడంతో గేట్లన్నీ ఎత్తారు. దీంతో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రూపంలో ఒకే స్థాయిలో 72,270 క్యూసెక్కుల నీరు తరలిపోతుందని ఇంజనీర్లు తెలిపారు.
సమ్మక్క సాగర్‌లోకి భారీగా వరద..
కన్నాయిగూడెం: నాలుగు రోజుల నుంచి మండలంతోపాటు ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వరద నీరు గోదావరిలోకి భారీగా చేరడంతో నది ఉధృతంగా ప్రవహిస్తూ గంటగంటకూ పెరుగుతోంది. ఫలితంగా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామ పరిధిలో గోదావరిపై ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి వరద నీరు భారీగా చేరుతోంది. శుక్రవారం సాయంత్రం వరకు బ్యారేజీలోకి 1,72,300 క్యూసెక్కుల నీరు చేరగా శనివారం సాయంత్రం వరకు క్రమక్రమంగా పెరుగుతూ 7,28,700 క్యూసెక్కుల నీరు చేరుతుంది. అంటే శనివారం సాయంత్రం వరకు అదనంగా ఐదు లక్షల యాబై వేల క్యూసెక్కులకు పైనే చేరి ప్రవహిస్తోంది. దీంతో బ్యారేజీ ప్రాంతమంతా జలమయమై కళకళలాడు తోంది. బ్యారేజీ వద్ద ఉన్న 59 గేట్లను ఎత్తి దిగువకు అదే మోతాదులో నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 82.0 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది. దేవాదుల ఎత్తిపోతల వద్ద 82.20 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది. కాగా, గోదావరి ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. వరద ముప్పునకు గురైతే వేలాది రూపాయలు పెట్టుబడితో సాగుచేసిన పంట నష్టపోతామని మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు.
ముందస్తుగా గేట్లు మూసివేత
ఎలాంటి ప్రమాదం లేదన్న ఇరిగేషన్ శాఖ


