● మానుకోటలో ఘటన
మహబూబాబాద్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై పి.రాజు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన పొన్నాల వెంకన్న (23) బైక్‌పై మంగళవారం సాయంత్రం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి ఈదులపూసపల్లిలోని తన బంధువు నాగేల్లి ప్రేమ్ ఇంటికి వచ్చాడు. అదే రోజు రాత్రి వెంకన్న, ప్రేమ్ ఇద్దరు కలిసి బైక్‌పై మహబూబాబాద్ వస్తుండగా బీజేపీ జిల్లా కార్యాలయ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకన్న, ప్రేమ్ ఇద్దరికి తీవ్రగాయాలుకాగా వాహనదారులు గమనించి 108కు సమాచారం ఇవ్వడంతో పైలట్ వీరన్న, ఈఎంటీ నరేశ్ ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వెంకన్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా మంగళవారం అర్ధరాత్రి మృతిచెందాడు. ప్రేమ్‌ను మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు రూరల్ ఏఎస్సై కిషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై బుధవారం తెలిపారు.


