తొర్రూరు: ప్రస్తుతం ఏర్పడిన కరువు కాలం తెచ్చినది కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం డివిజన్ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాల బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి గాంధీ సెంటర్‌లో ధర్నా చేపట్టారు. దయాకర్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన అబద్ధాల పునాదులపై సాగిందని, ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను ప్రభుత్వం నిండా ముంచిందన్నారు. వంద రోజుల వ్యవధిలో హామీలు అమలు చేస్తామన్న రేవంత్‌రెడ్డి వెయ్యి రోజులైనా అమలు చేయకుండా ప్రజలకు మొండి చేయి చూపారన్నారు. పాలనపై కాకుండా సంపాదనపై దృష్టి పెట్టాడన్నారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. పంటల సాగుకు నీళ్లు వదలాలని అడిగితే అరెస్టు చేసి కేసులు పెడుతున్నారన్నారు. పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే పుట్టెడు బాధలో ఉన్న రైతులపై రేవంత్‌రెడ్డి సర్కారు బలవంతంగా రుద్దుతున్న కరువు ఇది అని స్పష్టం చేశారు. అన్ని సర్వేలు బీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని నివేదికలు ఇచ్చాయన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని, తాను పాలకుర్తిలో గెలిచి మంత్రిని అవుతానని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పసుమర్తి సీతారాములు, మంగళపల్లి శ్రీనివాస్, తూర్పాటి చిన్న అంజయ్య, రామిని శ్రీనివాస్, ఈదురు ఐలయ్య, శ్రీరాం సుధీర్, సోమ నర్సింహారెడ్డి, మూనావత్ నర్సింహనాయక్, జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, కుర్ర శ్రీనివాస్, నలమాస ప్రమోద్, అనుమాండ్ల ప్రదీప్‌రెడ్డి, అంకూస్, ధరావత్ జైసింగ్, శామకూరి ఐలయ్య, వీరారెడ్డి, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
అబద్ధాల పునాదులపై రేవంత్‌రెడ్డి పాలన
మాజీ మంత్రి దయాకర్‌రావు


