నాయకులపై ఒత్తిడి! | - | Sakshi
Sakshi News home page

నాయకులపై ఒత్తిడి!

Aug 29 2026 1:34 AM | Updated on Aug 29 2026 1:34 AM

– 9లోu

న్యూస్‌రీల్‌

సీఎంఆర్‌ రికవరీపై దూకుడు పెంచిన అధికారులు

నాయకుల వద్దకు మిల్లర్ల పరుగులు

ఏమీ చేయలేని స్థితిలో నేతలు

ఇప్పటికే పలువురు మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు

ఆర్‌ఆర్‌ యాక్ట్‌పై జిల్లా యంత్రాంగం నజర్‌

శనివారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2026

సాక్షి, మహబూబాబాద్‌: కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) పెట్టకుండా ఎగవేతకు సిద్ధమైన రైస్‌ మిల్లర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. డబ్బుల రికవరీ తప్ప మరో మార్గంలేదని తేల్చి చెప్పిన అధికారులు క్రిమినల్‌ కేసులు పెడుతున్నారు. ఈక్రమంలో తమను కాపాడాలని పలువురు మిల్లర్లు అధికార పార్టీకి చెందిన నాయకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం రికవరీపై సీఎంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం సీరియస్‌గా ఉండడంతో ఏం చేయాలో నా యకులకు పాలుపోవడం లేదు. అటు కార్యకర్తలు, ఇటు పార్టీ పెద్దలను ఏమీ అనలేని పరిస్థితిలో ఉ న్నారు. ఈ విషయంలో నేనేమీ చేయలేనని, రికవరీ చేయాల్సిందే అని తేల్చిచెప్పినట్లు సమాచారం.

దూకుడు పెంచిన అధికారులు

జిల్లాలో 2017–22 మధ్యకాలంలో యాసంగి, వానాకాలం సీజన్‌లలో సీఎంఆర్‌ పెట్టని ఐదు మిల్లుల యజమానులు రూ.15కోట్లు బకాయిలు పడ్డారు. దీంతో ఇప్పటికే వారిపై ఆర్‌ఆర్‌ యాక్ట్‌కింద కేసులు నమోదు చేశారు. 2021–22 సీజన్‌లో ధాన్యం తీసుకొని 10 రైస్‌మిల్లుల యజమానులు సుమారు రూ.15కోట్ల విలువచేసే బియ్యం పెట్టకుండా అమ్ముకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా 2022–23 సీజన్‌లో ధాన్యం దిగుమతి చేసుకున్న 21మంది మిల్లర్లు సీఎంఆర్‌ పెట్టలేదు. అయితే ఆ ధాన్యం ప్రభుత్వం ఇతర వ్యాపారులకు వేలం ద్వారా కేటాయించింది. అయితే వేలందారులకు మిల్లర్లు ఆ ధాన్యం పెట్టలేదు. ఇలా వారి వద్ద నుంచి సుమారు రూ.80కోట్లు రావాల్సి ఉంది. ఇలా జిల్లాలో మొత్తం రూ.115 కోట్ల విలువచేసే బియ్యం మిల్లర్ల నుంచి రావాలి. ఈమేరకు రికవరీ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక టాస్క్‌ ఫొర్స్‌ బృందాలను రంగంలోకి దించారు. విజిలెన్స్‌ దాడులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో నాలుగు రైస్‌ మిల్లుల యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. రికవరీ డబ్బులు చెల్లించకుంటే మీకు ఇదే గతి పడుతుందని మిగిలిన మిల్లర్లను హెచ్చరించారు.

బిగుస్తున్న ఉచ్చు..

కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తీసుకొని సీఎంఆర్‌ పెట్టకుండా మొండికేసిన ఎనిమిది రైస్‌ మిల్లుల యజమానులపై రెండు సంవత్సరాల క్రితం కేసులు నమోదు చేశారు. అంతటితో ఆగకుండా రెవెన్యూ రికవరీ యాక్ట్‌ద్వారా డబ్బులు వసూలు చేయాలని అధికారులను ఆదేశించడంతో ఆర్‌ఆర్‌ యాక్ట్‌ పెట్టారు. అయితే ఏడాది కాలంగా ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో గతంలో కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై చర్చ జరిగింది. ఆర్‌ఆర్‌ యాక్ట్‌ కింది డబ్బులు రికవరీ చేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిసింది. మిషన్‌ 100–కే భాగంగా సదరు వ్యక్తుల వివరాలు సేకరణ, రికవరీ మొదలైన అంశాలపై వారం వారం రివ్యూలు తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆర్‌ఆర్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన ప్రాంతాల తహసీల్దార్లకు రికవరీపై కఠినమైన ఆదేశాలు జారీ చేసేందుకు కలెక్టర్‌ సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. దీంతో సదరు మిల్లుల యజమానుల ఆస్తులు, భూములు, ఆర్థిక వనరులు మొదలైన వివరాలు సేకరించి రికవరీకి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది.

నాయకుల వద్దకు పరుగులు..

ఒక వైపు క్రిమినల్‌ కేసులు, మరో వైపు ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ద్వారా ఆస్తుల జప్తునకు అధికారులు సిద్ధం కావడంతో పలువురు రైస్‌ మిల్లు యజమానులు నాయకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీల వద్దకు వెళ్లి కాపాడమని వేడుకున్నవారు కొందరైతే.. అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడిని హైదరాబాద్‌లో కలిసి ఈ గండం నుంచి బయట వేయాలని కోరినట్లు తెలిసింది. అయితే వచ్చిన వారందరు తమ అనుచరులు, తననే నమ్ముకొని పార్టీలో చేరిన వారు కావడంతో సదరు నాయకుడు అటు ప్రభుత్వ నిర్ణయాన్ని కాదనలేక.. ఇటు పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాలో అర్థం కాక సతమతం అవుతున్నట్లు తెలిసింది. కావాలంటే గడువు ఇప్పిస్తాం.. కానీ, డబ్బులు చెల్లించ వద్దని నేను చెప్పలేనని కొందరితో తేల్చి చెప్పినట్లు సమాచారం. అదే విధంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిలో కూడా సీఎంఆర్‌ చెల్లించని వారు ఉండడంతో తమకు పరిచయం ఉన్న అధికార పార్టీలోని కీలక మంత్రి ద్వారా చెప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం. అయితే నా నియోజకవర్గంలోనే ఏం చేయలేక పోయానని ప్రస్తుత పరిస్థితిలో ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం లేదని చెప్పినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement