మహబూబాబాద్: నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పేదలు, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారాయి. మాంసం, చికెన్ ధరలు కూడా అడ్డగోలుగా పెరుగుతున్నాయి. ఉప్పు, సబ్బుల ధరలు మినహా అన్ని రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. కాగా, చక్కెర కిలో ధర ప్రస్తుతం రూ.70 ఉండగా.. రూ.100కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాపారులు అంటున్నారు.
కూరగాయల ధరలకు రెక్కలు..
కూరగాయాల ధరలు మార్కెట్‌లో మండిపోతున్నాయి. క్యారెట్ కిలో రూ.100, చిక్కుడు కాయలు రూ.100, కొత్తిమీర రూ.60, మెంతికూర రూ .100, క్యాబేజీ రూ.60, వంకాయ రూ.50, పచ్చిమిర్చి రూ.60, కాప్సికమ్ రూ.100, బెండకాయ రూ.60, దొండకాయ రూ.50, బీట్‌రూట్ రూ.60, కాకరకాయ రూ.60, టమాట రూ.30, ఆలుగడ్డలు కిలో ధర రూ.30 పలుకుతోంది.
పెట్రోలు, డీజిల్‌తో భారం..
పెట్రోల్, డీజిల్ ధరలు పేద ప్రజలపై తీవ్ర భారం చూపుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ లీటరు రూ.116 , డీజిల్ రూ.104 విక్రయిస్తున్నారు. కొన్ని నెలల క్రితం యుద్ధాల వల్ల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. అలాగే వంట గ్యాస్ ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి. జిల్లాలో పలు కంపెనీలకు చెందిన 2,11,531 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈఏడాది మార్చి 7న గ్యాస్ సిలిండర్ ధర రూ 60 పెరిగింది. అప్పటి వరకు సిలిండర్ ధర రూ.924 ఉండగా.. రూ.60 పెరగడంతో రూ.984కి చేరింది. అలాగే జూన్‌లో మళ్లీ రూ.29 పెరుగగా రూ.1,013కి చేరింది. డెలివరీ పేరుతో రూ.1,030 తీసుకుంటున్నారు.
అమాంతం పెరిగిన బియ్యం ధరలు..
మాములు సన్న బియ్యం క్వింటా ధర రూ.6,000పైనే ఉంది. జై శ్రీరాం లాంటి బియ్యం అయితే రూ.7,000కు విక్రయిస్తున్నారు. ఈసారి వర్షాలు లేక పంటలు పండే పరిస్థితి లేదు. కరువు సాకుగా చూపి క్వింటా రూ.8,000పైనే విక్రయించే పరిస్థితి ఉందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మాంసం కేజీ రూ.1,000, బోన్‌లెస్ మటన్ రూ.1,200, చికెన్ రూ.220 వరకు విక్రయిస్తున్నారు. కోడి గుడ్ల ధరలు ఈమధ్య కాలంలో కొంత తగ్గాయి.
పచ్చడి మెతుకులే శరణ్యం..
ఇలాగే ధరలు పెరిగితే పచ్చడి మెతుకులే శరణ్యమని పేదలు, మధ్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చళ్లు తినే పాత రోజులు వస్తాయని వారు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించకపోతే పేదలు, మధ్య తరగతి వారికి ఇబ్బందులు తప్పవు.
రోజురోజుకూ పెరుగుతున్న
నిత్యావసర వస్తువుల ధరలు
మండుతున్న కూరగాయల రేట్లు..
చేదెక్కిన చెక్కర
మరోవైపు వేధిస్తున్న పెట్రోల్, డీజిల్,
గ్యాస్ ధరలు
ఇలాగే పెరిగితే పచ్చడి మెతుకులే
దిక్కని పేదల ఆవేదన
కట్టడి చేయాలని వేడుకోలు
నిత్యావసరాల ధరలు (రూ.లలో)
వస్తువు (కిలో) నెలక్రితం ప్రస్తుతం
చక్కెర 42 70
ఉల్లిగడ్డలు 25 60
కారం 200 360
పసుపు 220 300
ధనియాలు 140 230
అల్లం 50 130
ఎల్లిగడ్డలు 120 250
పల్లీలు 100 150
మినప పప్పు 120 140
పెసర పప్పు 110 120
కంది పప్పు 120 140
మైసూర్ పప్పు 80 100
శనిగపప్పు 80 90
చింతపండు 135 150
పెసర్లు 85 100
ధరలు తగ్గించాలి
నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇలాగే పెరిగితే వాటిని కొనుగోలు చేయలేం. పచ్చడితో అన్నం తినాల్సిందే. ఇప్పటికే ఒకకూర వండుకుని జాగ్రత్తగా మూడు పూటలు తింటున్నాం.
–సాంబారి మనీష,
గృహిణి, జమాండ్లపల్లి
పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రించాలి
పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించాలి. వాటిని సాకుగా చూపుతూ మిగితా వస్తువుల ధరలు పెంచుతున్నారు. వంట గ్యాస్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ధరలు నియంత్రించకపోతే పేద, మధ్య తరగతి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం స్పందించి అన్ని ధరలు నియంత్రించాలి.
– పెరుగుకుమార్, మానుకోట


