రుచికరం.. ఆరోగ్యం పదిలం | - | Sakshi
Sakshi News home page

రుచికరం.. ఆరోగ్యం పదిలం

Aug 29 2026 1:34 AM | Updated on Aug 29 2026 1:34 AM

ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం సమక్క, సారలమ్మ మహాజాతర.. ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. పరా క్రమం, ధిక్కార స్వరానికి నిలువెత్తు నిదర్శనం. ఆదివాసీల భక్తి, సంప్రదాయాలకు ప్రతీక. ఈ క్రమంలో ఇన్ని ప్రత్యేకలున్న ఈ మహాజాతరలో ఆదివాసీల సంప్రదాయ ఆహారానికి ఆధునికతను జోడించి తయారు చేస్తున్న ఇప్పపువ్వు లడ్డూ ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అడవిలో లభించే ఇప్పపువ్వుతో తయారు చేస్తున్న ఈ లడ్డూకు భక్తులు, పర్యాటకుల ఆదరణ లభిస్తోంది. రుచికరం.. ఆరోగ్యం పదిలంగా ఉంచే సహజ ఆహారంగా గుర్తింపు పొందుతుండడంతోపాటు ఆదివాసీ మహిళలకు ఉపాధి, ఆదాయం అందిస్తోంది. అడవిని నమ్ముకుని జీవించే ఆదివాసీ, గిరిజనులకు ఇది ఆహార వనరు మాత్రమే కాదు.. కుటుంబానికి ఆదాయాన్ని సమకూర్చే అటవీ ఉత్పత్తి కూ డా. తరాలుగా తమ ఆహార సంస్కృతిలో భాగమైన ఇప్పపువ్వుకు ప్రస్తుతం మార్కెట్‌ విలువను జోడిస్తున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క చొరవతో తెలంగాణ సమ్మిళిత జీవనోపాధుల ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక సహకారంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) ఆధ్వర్యంలో ఇప్పపువ్వు లడ్డూ తయారీపై శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.

కొండపర్తి, కన్నెపల్లిలో తయారీ..

ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలంలోని కొండపర్తికి చెందిన సమ్మక్క, సారక్క మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం, కన్నెపల్లికి చెందిన సారలమ్మ మహిళా రైతు ఉత్పిత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఇప్పపువ్వు లడ్డూలు తయారు చేస్తున్నారు. స్థానికంగా లభించే ఇప్పపువ్వును సేకరించి శుభ్రపరిచి ఎండబెట్టి నిల్వ చేసుకుంటున్నారు. అనంతరం వాటిని లడ్డూల తయారీకి వినియోగిస్తున్నారు. సంప్రదాయ పద్ధతులకు ఆధునిక ఆలోచనలు జోడించి లడ్డూలను తయారు చేస్తున్నారు. బాదం, పిస్తా, జీడిపప్పు, నువ్వులు, పల్లీలు, వివిధ రకాల డ్రైఫ్రూట్స్‌తోపాటు నెయ్యి, తాటి బెల్లం, తేనె వంటి సహజ పదార్థాలను ఉపయోగిస్తున్నారు. దీంతో ఇప్పపువ్వు లడ్డూకు ప్రత్యేక రుచి రావడంతోపాటు సంప్రదాయ ఆహారానికి కొత్త రూపం లభిస్తోంది.

భక్తులకు ఆదివాసీ సంప్రదాయ ఆహార ఉత్పత్తుల పరిచయం

మహిళా సంఘాలు తయారు చేసిన లడ్డూలను మేడారం పరిసరాల్లో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. గద్దెల ప్రాంగణం నుంచి బయటకు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల స్టాళ్ల వద్ద భక్తులు లడ్డూలను ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. మేడారంలోనే కాకుండా వరంగల్‌ హైవే, బొగత లాంటి పర్యటక ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. దీంతో జాతరకు వచ్చే భక్తులకు ఆదివాసీ సంప్రదాయ ఆహార ఉత్పత్తులను పరిచయం చేసే అవకాశం లభిస్తోంది.

ఇప్పపువ్వుకు ఆదివాసీల

ఆహార సంస్కృతిలో ప్రత్యేక స్థానం..

ఇప్పపువ్వుకు ఆదివాసీల ఆహార సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పపువ్వును నానబెట్టి సంప్రదాయ పద్ధతుల్లో పులియబెట్టిన పానీయాలను తయారు చేసే ఆచారం కూడా ఉంది. పండుగలు, శుభకార్యాల సమయంలో వీటి వినియోగం తరాలుగా కొనసాగుతోంది. కాగా, త్వరలో ఇప్ప పువ్వు లడ్డూలను ఆన్‌లైన్‌లో కూడా విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సెర్ప్‌ అధికారులు తెలిపారు.

ఇప్ప పువ్వు లడ్డూకు పెరుగుతున్న క్రేజ్‌

ఆదివాసీ మహిళలకు కొత్త ఉపాధి

కొనుగోళ్లకు భక్తుల ఆసక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement