లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన గోపగోని శ్రీదేవి (14) ఉత్తరప్రదేశ్‌లో ఈ నెల 25వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన గోపగోని స్వర్ణలత, నాగరాజు కూతురు శ్రీదేవి అనా రోగ్యంతో ఉండడంతో సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ బాబా మహిమను చూసి కారులో యూపీలోని అతడి వద్దకు వెళ్తుండగా వాహనం డివైడర్‌ను ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో జనగామ మండలం పెంబర్తికి చెందిన కారు డ్రైవర్ పల్లపు సంపత్ (26) అక్కడికక్కడే దుర్మరణం చెందగా శ్రీదేవి, స్వర్ణలత, నాగరాజు గాయపడ్డారు. శ్రీదేవికి తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లి అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో డ్రైవర్ సంపత్, శ్రీదేవి మృతితో మృతుల సంఖ్య రెండుకు చేరింది. కాగా, మూఢనమ్మకాలు ఆ కుటుంబాని చిందవందర చేశాయంటూ పలువురు గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీదేవి మృతితో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
యూపీ ప్రమాదంలో రెండుకు చేరిన మృతుల సంఖ్య


