మహబూబాబాద్ అర్బన్: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తొలిసారిగా మధ్యాహ్న భోజనం అమల్లోకి తీసుకువచ్చింది. అయితే గిరిజన జిల్లా అయిన మానుకోటలో మాత్రం అమలు చేయకుండా ప్రభుత్వం చిన్న చూపుచూస్తోందని ఆరోపణలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. ఇక్కడ కూడా మధ్యాహ్నభోజనం అమలు చేస్తే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అధ్యాపకులు కోరుతున్నారు.
జిల్లాలో 10 కళాశాలలు..
జిల్లాలో 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అందులో మొత్తం ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 2,237 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు కళాశాలలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం అల్పాహారం తిని సాయంత్రం వరకు క్లాస్‌లు విని ఆకలితో ఇంటికి చేరుకుంటున్నారు. కొంత మంది విద్యార్థులు తమ వెసులుబాటును బట్టి ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. మరికొంత మంది భోజనం లేక సాయత్రం వరకు నీరసించి పోతున్నారు. ఈక్రమంలో కొంతమంది విద్యార్థులు మధ్యాహ్నమే ఇళ్లకు వెళ్తున్నారు. దీంతో హాజరుశాతం అంతంతగానే ఉంటోందని అధ్యాపకులు తెలుపుతున్నారు.
దాతల సాయంతో..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలో జనవరిలో పరీక్షల సమయంలో అధ్యాపకులు, ఉషోదయ వాకర్స్ అసోసియేషన్, ప్రిన్సిపాళ్ల సాయంతో భోజనం సౌకర్యం కల్పించి విద్యార్థుల ఆకలి తీర్చారు. దాతలు ప్రస్తుతం ముదుకు రాకపోవడంతో మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. కాగా, ఇప్పటికై నా ప్రభుత్వం జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
జిల్లాలో జూనియర్ కళాశాలల్లో అమలు
కాని మధ్యాహ్న భోజనం కార్యక్రమం
ఉదయమే కళాశాలలకు
చేరుకుంటున్న విద్యార్థులు
పగటిపూట అర్ధాకలితో
క్లాస్‌లు వింటున్న వైనం
మధ్యాహ్న భోజనం అమలు చేయాలి
అన్ని జిల్లాలో మాదిరిగా మానుకోటలోనూ మధ్యాహ్న భోజనం అమలు చేస్తే ఎంతో మంది గిరిజన, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల ఆకలి తీర్చవచ్చు. మధ్యాహ్న భోజనం అమలు లేక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య తగ్గుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరుతున్నా.
–పొక్కుల సదానందం, మానుకోట బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్
ఇంటికి వెళ్లేసరికి రాత్రి అవుతుంది..
ఉయదం తినకుండానే కళాశాలకు రావాల్సి వస్తుంది. మధ్యాహ్నం డబ్బులు ఉంటే ఏదైనా బేకరిఫుడ్ తీసుకుంటాను. డబ్బులు లేకపోతే ఖాళీ కడుపుతోనే ఉంటాను. ఇంటికి వెళ్లేసరికి రాత్రి అవుతుంది. అధికారులు స్పందించి మాకు మధ్యాహ్న భోజనం చేయాలి.
–బానోతు అక్షయ,
బైపీసీ ద్వితీయ సంవత్సరం


