అధికార పార్టీ గెలిస్తేనే అభివృద్ధి
● రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
తొర్రూరు: కత్తి మాకు ఇస్తే యుద్ధభూమిలో నిలుస్తామని, వేరొకరికి అప్పగిస్తే ప్రయోజనం లేదని, అధికార పార్టీ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌ న్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి పొంగులేటి శనివారం రోడ్ షో నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్, అన్నారం రోడ్డులో నిర్వహించిన కార్నర్ మీ టింగ్‌లో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝా న్సీరెడ్డిలతో కలిసి మంత్రి మాట్లాడారు. ఇళ్లు కట్టిస్తామని, అభివృద్ధి మాతోనే జరుగుతుందని బీఆర్‌ఎస్ నాయకులు హామీలు ఇవ్వడం హాస్యాస్పదమని, అధికారంలో లేకున్నా ఉన్నామనే భ్రమలో ప్రతిపక్ష నేతలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తొర్రూరును దత్తత తీసుకున్నానని, ఎన్నికలు ముగియగానే పట్టణానికి ఫైర్ స్టేషన్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మంజూరు చేస్తానని తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్లు ఇవ్వకుండా మోసగించిందని, ప్రజా ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. ప్రతి ఏప్రిల్‌లో పేదలకు కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. తొర్రూరు పట్టణ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.


