వెనక్కి తగ్గని విద్యుత్ సంస్థలు
● నేడు టీజీ ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్నా
హన్మకొండ: విద్యుత్ సంస్థల్లో చేపట్టిన బదిలీల రద్దుపై యాజమాన్యాలు సానుకూలంగా స్పందించలేదు. దీంతో ఈ నెల 28న హైదరాబాద్‌లోని టీజీ ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టాలని మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సంయుక్త సమావేశంలో విద్యుత్ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ ఫోరం నిర్ణయం తీసుకుంది. యాజమాన్యాల నియంతృత్వ వైఖరికి నిరసనగా ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కేవీ జాన్సన్, తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ తెలిపారు. ఇప్పటికై నా విద్యుత్ శాఖ మంత్రి జోక్యం తీసుకుని బదిలీలు వాయిదా వేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులందరు ధర్నాకు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. మరో వైపు మంగళవారం బదిలీలు కోరుకునే వారి ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ముగిసింది. ఈనెల 30న బదిలీ ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. కాగా, మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో బదిలీలపై కొత్త సమస్య ముందుకు వచ్చింది. ముందే బదిలీ షెడ్యూల్ విడుదలైనందున ఎన్నికల నిబంధనలు వర్తిస్తాయా లేదా అనే సందేహంలో అధికారులు ఉన్నారు.


