క్రెడిట్ కార్డు లిమిట్ పెంపు పేరుతో మోసాలు..
● యువకుడి అరెస్ట్, రిమాండ్
● వివరాలు వెల్లడించిన పోలీసులు
వరంగల్ క్రైం : లిమిట్ పెంపు పేరిట అమాయకుల క్రెడిట్ కార్డుల నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ మోసం చేస్తున్న బలోజు అఖిల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు హనుమకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. అఖిల్ ఇంతకుముందు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు విభాగం ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన సమయంలో తన దగ్గరకు వచ్చిన కస్టమర్లను మోసం చేసి తన అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో బ్యాంకు అధికారులు అఖిల్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత కూడా తాను ఎస్‌బీఐలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నానని చెప్పి తనకు తెలిసిన పాత కస్టమర్ల దగ్గరికి వెళ్లేవాడు. క్రెడిట్ కార్డు అమౌంట్ లిమిట్ పెంపుదల చేస్తానని హనుమకొండకు చెందిన ముగ్గురు బాధితుల దగ్గర నుంచి సుమారు రూ. రెండు లక్షలు తన అకౌంట్‌లోకి మార్చుకున్నాడు. అలాగే, హుస్నాబాద్‌కు చెందిన బాధితుడి నుంచి రూ. 1,40,000 ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. ఈ ఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అఖిల్‌ను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి కారు, రూ.10 వేల నగదు, ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.


