జాతరలో సాంకేతికత వినియోగం..
హన్మకొండ : సమ్మక్క, సారలమ్మ మహాజాతర జరిగే మేడారం విద్యుత్ వెలుగులతో జిగేల్‌మంటోంది. రాత్రి సమయంలోనూ పగలు మాదిరి కనిపిస్తుంది. ఈ నెల 28, 29, 30, 31 తేదీల్లో జరిగే వన దేవతల జాతరలో నిరంతరాయంగా విద్యు త్ సరఫరా జరిగేలా టీజీ ఎన్పీడీసీఎల్ అన్ని ఏర్పా ట్లు చేసింది. విద్యుత్ లైన్లు తెగిపడితే ప్రమా దం జరిగే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో లైన్లు తెగి భూమి పడకుండా ఫోర్ వైర్ స్పేషర్స్ ఏర్పాటు చేసింది. దీని వల్ల నాలుగింటిలో ఏ ఒక్క వైరు తెగినా నేలపై పడుకుండా ఫోర్ వైర్ స్పేషర్స్ అడ్డుకుంటా యి. ఈ క్రమంలో మంగళవా రం మేడారంలో విద్యుత్ ఏర్పాట్లను టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి పర్యవేక్షించారు.
రూ.15 కోట్ల అంచనా వ్యయంతో విద్యుత్ ఏర్పాట్లు..
మేడారం మహాజాతరలో రూ.15 కోట్ల అంచనా వ్యయంతో విద్యుత్ ఏర్పాట్లు చేపట్టారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరైన మేడారానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి విద్యుత్ సమస్య తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు. ఇందులో భాగంగా మేడారంలోని రెండింటితో పాటు తాడ్వాయి, నార్లాపూర్‌లో కొత్తగా నిర్మించిన సబ్ స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. మేడారం కొత్తూరు 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో 8 ఎంవీఎ సామర్థ్యం కలిగిన 2 పవర్ టాన్స్‌ఫార్మర్లు, సమ్మక్క సబ్ స్టేషన్ (కొత్త)లో 5 ఎంవీఏ సామర్థ్యం కలిగిన రెండు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఈ రెండు సబ్ స్టేషన్లకు విద్యుత్ అంతరాయం కలగకుండా రెండు వైపుల నుంచి కరెంట్ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా విద్యుత్ సరఫరాలో వైఫల్యాలకు తావు లేకుండా వివిధ సామర్థ్యం కలిగిన అదనంగా 196 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. 49 కిలో మీటర్ల హెచ్‌టీ, ఎల్‌టీ లైన్లు వేశారు. మేడారంలోనే గద్దెల ప్రాంతం మొదలు.. భక్తులు ఆవాసం ఏర్పరుచుకునే అన్ని ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. దీంతో మేడారంలో ఎటు చూసిన విద్యుత్ వెలుగులు జిగేలుమంటున్నాయి.
మేడారం తరలిన సిబ్బంది..
టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం అధికారులు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది మంగళవారం మేడారం చేరుకుని తమకు కేటాయించిన ప్రాంతాల్లో విధుల్లో చేరారు. వీరు ఫిబ్రవరి ఒకటి వరకు జాతరలో సేవలు అందిస్తారు. ఇద్దరు డైరెక్టర్లు టి.మధుసూదన్, వి.మోహన్ రావు, చీఫ్ ఇంజనీర్లు కె.రాజు చౌహాన్, అశోక్ పర్యవేక్షణలో నలుగురు సూపరిండెంట్ ఇంజనీర్లు, ఏడుగురు డివిజన్ ఇంజనీర్లు, 20 మంది అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్లు 150 మంది, 350 మంది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులు మూడు బ్యాచ్‌ల్లో 30 మంది చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. వీరు తమకు కేటాయించిన ప్రాంతాల్లో లైన్ పెట్రోలింగ్ చేస్తూ లోపాలను గుర్తిస్తూ సరి చేస్తారు. రాత్రి, పగలు నిరంతరాయంగా విధులు నిర్వర్తిస్తూ భక్తులకు విద్యుత్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారు. కాగా, విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద గద్దెల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
ఈసారి జాతరలో సాంకేతికతను వినియోగిస్తున్నారు. రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టం ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్లలో రియల్ టైమ్‌లో లోడ్‌ను పర్యవేక్షించనున్నారు. తద్వారా లోడ్‌ను నియంత్రిస్తారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఫ్యూజ్‌లు పోవడం, ఇతరత్రా అంతరాయాలు, డీటీఆర్‌లపై ఓవర్ లోడ్ పెరిగితే వెంటనే సమాచారం అందుతుంది. తద్వారా వెంటనే లోపాలను సరిదిద్ది వినియోగదారులకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందిస్తారు. ట్రిప్పింగ్‌లను నివారించడానికి జాతరలో 26 కిలో మీటర్లు కవర్డ్ కండక్టర్ లైన్ వేశారు.33 కేవీ విద్యుత్ లైన్‌లో 24 గంటలు గస్తీ నిర్వహించడానికి పస్రా, గోవిందరావుపేట, ములుగు, ఏటూరునాగారం, కమలాపూర్ సబ్ స్టేషన్ ప్రాంగణాల్లో నిర్వహణ బృందాలు మొహరించారు. టీజీ ట్రాన్స్‌కో పస్రా, ములుగు, కమలాపూర్, చెల్పూరు, వరంగల్ ఈహెచ్‌టీ సబ్ స్టేషన్లలో 20 మంది ఇంజనీర్లు, ఆపరేషన్ మెయింటెనెన్స్ సిబ్బందిని నియమించారు. వీరితోపాటు మరో 40 మంది కాంట్రాక్ట్ కార్మికులను సిద్ధంగా ఉంచారు. అత్యవసర పనుల నిర్వహణకు 20 రవాణ, మరో 10 ఇతర వాహనాలు సిద్ధంగా ఉంచారు.


