మేడారంలో అంతర్జాతీయ
సాంస్కృతిక దృశ్యం ఆవిష్కృతం
ఎస్‌ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వా యి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరలో అంతర్జాతీయ సాంస్కృతిక దృశ్యం ఆవిష్కృతమైంది. న్యూజిలాండ్‌కు చెందిన మావోరి తెగ ప్రతినిధులు సోమవారం మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో తమ సంప్రదాయ నృత్యమైన హాకాను ప్రదర్శించా రు. ఇది భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. యుద్ధానికి సిద్ధమయ్యే వేళ మావోరి సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు, శత్రువుల్లో భయం కలిగించేందుకు చేసే నృత్యం హాకా. ప్రత్యేక ఈ నృత్యం ముఖాభినయాలు, శరీర చలనాలతో సాగింది. తెలంగాణ–న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీత క్క ప్రత్యేక చొరవతో మావోరి ప్రతినిధులు మేడారానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. హాకా సమయంలో మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతికి దేశాలు, భాషలు అడ్డుకావని, ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీల జీవన విధా నం, విశ్వాసాలు ఒకే తత్వాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. కాగా, మావోరి ప్రతినిధులకు మంత్రి స్వాగతం పలికి దగ్గరుండి అమ్మవార్ల దర్శనం కల్పించి వనదేవతల చరిత్ర, వైభవాన్ని వివరించారు. అనంతరం బంగారం, ప్రసాదం అందజేసి సన్మానించారు. ముందుగా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ చిత్రాల మెమోంటోలను మావోరి ప్రతినిధులకు బహూకరించారు. కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఆర్‌డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు.
జాతరలో మావోరి తెగ హాకా నృత్యం..
ఆకట్టుకున్న న్యూజిలాండ్ గిరిజనులు
స్వాగతం పలికిన మంత్రి సీతక్క


