ఆదివాసీ సాంస్కృతిక సంబురం!
లక్ష్మీదేవర..
ఎస్‌ఎస్‌తాడ్వాయి/ ఏటూరునాగారం : నృత్యమంటే ఆదివాసీలకు సంబురం. అది ఆటవిడుపుకై నా.. ఆనందానికై నా. ఈ రెండింటిలో ఏ సందర్భమైనా అంతా కలిసి నృత్యం చేస్తారు. పూర్వీకుల నుంచి వచ్చిన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వస్త్రధారణ అంతా వారి నృత్యాల్లో కనిపిస్తుంటుంది. మహాజాతర సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఆదివాసీ కళాకారులు మేడారానికి చేరుకుని మ్యూజియంలో సంస్కతి, సంప్రదాయ నృత్యాలు, ఆటపాటలు ప్రదర్శిస్తుంటారు. ఈశాన్య రాష్ట్రాలోని వివిధ జాతుల ఆదివాసీల్లో మనకు భిన్న రకాల నృత్యాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మేడారంలో గద్దెల పునరుద్ధరణ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివాసీలు ప్రదర్శించిన వివిధ రకాల నృత్యాలు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి మండలి, పలువురు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఆదివాసీ నృత్యాలు ఎన్ని రకాలు? వాటి పేర్లు, తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
వివాహాలు,దేవర్ల కొలువులు, పండుగలు తదితర ఉత్సవాల్లో ఆదివాసీలు ఈ నృత్యాలు ప్రదర్శిస్తారు. పంచె, బనియాన్ ధరించి తలపాగ కట్టుకుని, చేతిలో రుమాలు పట్టుకొని, కాళ్లకు గజ్జెలు ధరించి వలయాకారంగా తిరుగుతూ సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తుంటారు. రెండు సన్నాయిలు, మూడు మేళాలు ఈ నృత్యంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సందర్భాన్ని బట్టి 20 నుంచి 30 మంది వరకు పురుషులు ఈ నృత్యంలో పాల్గొంటారు. ఒకరి భుజంపై మరొకరు చేతులు వేసి బృంద నాయకుడి సైగలను అనుసరించి నృత్యం చేస్తుంటారు. వరంగల్ జిల్లాలోని కోయలు, నాయకపోడులు ఈ నృత్యాలు చేస్తుంటారు.
ఆదివాసీలు రేల నృత్యం చేస్తారు. ముఖ్యంగా భూమి పండుగ, ముత్యాలమ్మ పండుగ, కొలుపు, తాటిచెట్టు పండుగ, లేలే పండుగ, వంటి సందర్భాల్లో వెన్నెల రాత్రుల్లో ఈ రేల నృత్యం ప్రదర్శిస్తారు. ఒకరి నడుముపై ఒకరు చేతులు వేసి, మూడు అడుగులు ముందుకు, వెనకకు వేస్తూ పాటకు అనుగుణంగా నృత్యం చేస్తారు.
గోండులు ఆనందంతో చేసే నృత్యమే ఈ గుస్సాడి లేదా దండారి నృత్యం. ఈ నృత్యంతో గ్రామాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలు మెరుగు పరుచుకోవాలని, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆలోచిస్తారు. దీపావళికి పది రోజుల మందు నుంచే ఈ నృత్యంతో ఆదివాసీలు వేడుకలు జరుపుతారు. ఈ నృత్య కాలంలో చలి ఉంటుంది. అందుకే నెగళ్ల పెట్టుకుని చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తారు.
డోలు వాయిస్తున్న కళాకారులు
ఈ నృత్యాన్ని ఆదివాసీ నాయకపోడులు ప్రదర్శిస్తుంటారు. చెక్కతో తయారు చేసిన గుర్రపు ముఖం శరీరానికి తగిలించుకుని పూనకంతో ఉన్న వ్యక్తి లయబద్దంగా నృత్యం చేస్తాడు. ఇతని తోడుగా చెక్కతో తయారు చేసిన పోతురాజు ముఖం, కిష్టస్వామి ముఖం వంటివి ధరించి బృందంగా తయారై నృత్యం చేస్తారు.
ఆదివాసీ సాంస్కృతిక సంబురం!
ఆదివాసీ సాంస్కృతిక సంబురం!


