సర్కిల్‌లో డాష్ బోర్డులు..
హన్మకొండ: వచ్చే గణతంత్ర దినోత్సవం నాటికి అన్ని సర్కిళ్లలో డాష్ బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ 33, 11 కేవీ విద్యుత్ లైన్లను జీఐఎస్ మ్యాపింగ్ చేపడుతున్నామన్నారు. 2024–25లో తలసరి విద్యుత్ వినియోగం 1,680 యూనిట్లకు చేరిందన్నారు. ఇది గత ఏడాదితో పోలిస్తే మెరుగుపడిందన్నారు. డిసెంబర్ 2025లో 25.35 లక్షల మంది వినియోగదారులకు ‘జీరో బిల్లులు’ అందించామన్నారు. 14.40 లక్షల మంది రైతులకు 24 గంటలు, 15,831 ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 2025లో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన వినియోగదారుల సేవ రేటింగ్‌లో టీజీ ఎన్పీడీసీఎల్ దేశంలోనే 5వ స్థానంలో నిలిచి ‘ఎ’ గ్రేడ్ సాధించిందన్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి. తిరుపతి రెడ్డి, టి. మధుసూదన్, సి.ప్రభాకర్, సి.ఈలు టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, కె.రాజు చౌహాన్, అశోక్, మాధవరావు, కె.వెంకటరమణ, సురేందర్, శ్రవణ్ కుమార్, జయవంత్ రావు చౌహాన్, అన్నపూర్ణ, సీజీఎంలు రవీంద్రనాఽథ్, చరణ్ దాస్, కిషన్, జాయింట్ సెక్రటరీలు శ్రీ కృష్ణ, రమేశ్, కంపెనీ సెక్రెటరీ కె.వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
1,680 యూనిట్లకు చేరిన
తలసరి వినియోగం
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
కర్నాటి వరుణ్ రెడ్డి


